ఏసీ లా కళాశాలలో యఽథావిధిగా ప్రవేశాలు

19 Nov, 2023 01:38 IST|Sakshi
కళాశాల కరస్పాండెంట్‌ జి.ఎలీషా

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరులోని ఏసీ లా కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో యఽథావిధిగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్‌ జి. ఎలీషా తెలిపారు. శనివారం ఏసీ లా కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎలీషా మాట్లాడుతూ ఏపీ ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ కమిషన్‌కు తమ కళాశాల నుంచి సకాలంలో ఫీజుల వివరాలను సమర్పించకపోవడంతో కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లా–సెట్‌ కౌన్సెలింగ్‌ నుంచి కళాశాలను తొలగించిందని చెప్పారు. అయితే గత ప్రిన్సిపాల్‌ వ్యవహరించిన తీరుతో జరిగిన నష్టాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం ఫీజుల నియంత్రణ కమిషన్‌ కోరిన వివరాలను సమర్పించినట్లు వివరించారు. దీంతో పాటు తమ కళాశాలలో లా–సెట్‌ ద్వారా యధావిధిగా ప్రవేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా అనుమతించాలని కోరుతూ, ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై కళాశాలకు అనుకూలంగా తీర్చు వచ్చిందని చెప్పారు. మైనార్టీ విద్యాసంస్థగా ఉన్న ఏసీ లా కళాశాలలో లా–సెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు ఈనెల 30 నుంచి తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 49 ఏళ్ల చరిత్ర కలిగిన ఏసీ లా కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏఈఎల్‌సీ సన్నాహాలు చేస్తోందని, కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమవంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ అమృత వర్షిణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు