కులగణనతో సామాజిక న్యాయం

19 Nov, 2023 01:36 IST|Sakshi
● సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ ● రాజకీయాల్లో ప్రతి కులానికి వాటా లభిస్తుంది ● రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్‌

కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ అన్నారు. గుంటూరులోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న కులగణన గురించి వంద సంవత్సరాలు చెప్పుకుంటారన్నారు. బ్రిటీష్‌ వారి హయాంలో చేపట్టిన కులగణనను కూడా మన దేశంలో మూడు శాతంగా ఉన్న అగ్రకులాలే అడ్డుకున్నాయని తెలిపా రు. కులగణన నాలుగేళ్లకు కూడా పూర్తి కాదని కొందరు అంటున్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడం ముఖ్యమంత్రికే సాధ్యమన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల్లో ఫీవర్‌ సర్వేను చేసి చూపించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా ఏడు రోజుల్లో కులగణన సర్వే పూర్తవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వందేళ్ల అనంతరం రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. కులగణనతో అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది స్పష్టంగా వెల్లడవుతుందని తెలిపారు. కులగణన పూర్తి నివేదిక తయారైన తరువాత అందుకు తగ్గ రిజర్వేషన్లు తదితర వాటిల్లో సమన్యాయం పాటించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర కేబినేట్‌లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారేనన్నారు. ముఖ్యమంత్రి చొరవతో 56 వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. అనేక కులాలు అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు