ఉమ్మడి వరంగల్‌లో.. మరోమారు రాహుల్‌గాంధీ!

2 Nov, 2023 11:02 IST|Sakshi

అంబట్‌పల్లిలో మహిళా సాధికారత సదస్సుకు హాజరు!

మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మరో సభ!

గత నెల 18న రామాంజపూర్‌లో సభ.. 15 రోజుల వ్యవధిలో రెండోసారి..

రాహుల్‌ సభ కోసం భారీగా ఏర్పాట్లు!

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేత, అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు వస్తున్నారు. గురువారం ఆయన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం, అంబట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గత నెల 18, 19 తేదీల్లో ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో బస్సుయాత్ర, సభలు నిర్వహించిన ఆయన.. సుమారు 15 రోజుల వ్యవధిలో రెండోసారి పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

అంబట్‌పల్లి సమీపంలో సుమారు ఐదువేల మందితో మహిళాసాధికారత సభను నిర్వహించుకునేందుకు అనుమతి లభించినా.. బుధవారం రాత్రి 9 గంటలకు హెలిపాడ్‌ ఏర్పాటు, హెలికాప్టర్‌ గ్రౌండ్స్‌ క్లియరెన్స్‌లు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా ఆదివాసీ ప్రాంతాలను ఎంచుకున్న రాహుల్‌గాంధీ.. ఉమ్మడి జిల్లాలో తొలి పర్యటన, సభలు ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లోనే మొదలెట్టారు.

గత నెల 18న హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌ ద్వారా రామప్ప ఆలయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ.. అక్కడినుంచే బస్సుయాత్ర ప్రారంభించారు. అనంతరం రామాంజాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత చెల్పూర్‌ జెన్‌కో గెస్టుహౌస్‌లో రాత్రి బస చేశారు. 19న ఉదయం బైక్‌ర్యాలీగా బస్సుయాత్ర సాగగా, కాటారం వద్ద జరిగిన సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఉదయమే కార్యక్రమం..
హెలికాప్టర్‌ ద్వారా గురువారం ఉదయమే జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేరుకోనున్నారు. ఈ మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రాహుల్‌ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీస్‌ బలగాలను మోహరించారు.

గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సభకు అనుమతి ఉండగా.. 8.30 గంటల నుంచి 11 గంటల వరకు మహిళలతో సదస్సు ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శశిభూషణ్‌ కాచే తెలిపారు. కాగా, అంబట్‌పల్లి సభలో పాల్గొననున్న రాహుల్‌గాంధీ.. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రాహుల్‌ పర్యటన ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు.
ఇవి చదవండి: ట్రిక్కులెన్ని చేసినా.. హ్యాట్రిక్‌ తప్పదు! : మంత్రి హరీశ్‌ రావు

మరిన్ని వార్తలు