Hyderabad: ఒక ఇంట్లో 146 ఓట్లు..!

7 May, 2023 07:44 IST|Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో ఇంటినెంబరు 10–4–55/బి చిరునామాలో ఐదు కాదు..పది కాదు ఏకంగా వంద ఓట్లున్నాయి. మీ దగ్గర వందేనా మేమింకా ఎక్కువే అన్నట్లు అదే నియోజకవర్గం మైలార్‌గడ్డలో 11–1–748గా ఉన్న ఇంటి నెంబరుతో 146 ఓట్లున్నాయి. ఓటరు జాబితాలో ఒకే ఇంట్లో ఉన్న ఈ ఓటర్ల సంఖ్యను చూసి హతాశులైన అధికారులు నిజానిజాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

● ఇలా ఒకే చిరునామాలో 50 నుంచి 100, అంతకంటే ఎక్కువే ఓటర్లున్న ప్రాంతాలు ఒక్క సికింద్రాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. హైదరాబాద్‌ జిల్లాలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లోనూ ఇలా ఒకే ఇంటి చిరునామాలో భారీసంఖ్యలో ఓటర్లున్నట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు వాటి పరిశీలనను చేపడుతున్నారు. బోగస్‌లుంటే సరిదిద్దే చర్యలు చేపట్టనున్నారు.

మొదలైన ఎన్నికల కసరత్తు..
రాష్ట్రంలో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. జిల్లా, అసెంబ్లీ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు, తదితరమైన వాటితో చేపట్టాల్సిన చర్యలపై అప్రమత్తం చేస్తోంది. జాబితా నుంచి ఓటర్లను తొలగించే పక్షంలో ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు నిబంధనల కనుగుణంగా తొలగించాలని సూచించింది. అంతేకాదు..ఇప్పటికే తొలగించిన ఓటర్లను మరోమారు పునఃపరిశీలించాలని కూడా ఆదేశించడంతో అందుకనుగుణంగా సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలగించిన ఓటర్లతోపాటు ఒకే ఇంట్లో ఎక్కువ ఓటర్లున్న వారివిసైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడమే కాకుండా అలాంటి ఇళ్లకు ఫిజికల్‌ ఫైళ్లను కూడా నిర్వహించాలని సూచించడంతో ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఒకే ఇంట్లో ఆరుగురికి మించితే..
ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువ ఓట్లున్నా కూడా పరిశీలిస్తూ ఫిజికల్‌ ఫైళ్లను నిర్వహించే చర్యలు చేపట్టారు.

ఎవరి పనిలో వారు..
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓవైపు రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు గుప్పిస్తూ బహిరంగ ప్రదర్శనలు చేస్తుండగా.. మరోవైపు ఎన్నికల యంత్రాంగం గుంభనంగా దాని పనులు అది చేసుకుంటూపోతోంది. ఆధార్‌తో లింకేజీ చేసుకోవాలని సూచిస్తుండటంతోపాటు అర్హులైన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడం తదితర పనులు చేస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాలకు అనువైన ప్రభుత్వ భవనాలను జీఐఎస్‌తో గుర్తించే పనులు చేపట్టారు.

అందుబాటులో ఈవీఎంలు..
ప్రజలు ఓట్లు వేసేందుకు పోలింగ్‌ సందర్భంగా వినియోగించే ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, కంట్రోల్‌ యూనిట్లను ఇప్పటికే చుడీబజార్‌ కేంద్రానికి తెప్పించారు. దాదాపు 6 వేల బ్యాలెట్‌ యూనిట్లు, 5 వేల పైచిలుకు వీవీప్యాట్‌లు, 4 వేల కంట్రోల్‌యూనిట్లు ఉన్నట్లు తెలిసింది. బూత్‌స్థాయి అధికారుల వివరాలు ఎప్పటికప్పుడు సంబంధిత యాప్‌లో నమోదు చేస్తున్నారు.

ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఓటర్ల నమోదు.. తీసివేతలు..కూడికలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఓటర్ల జాబితాపై ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశీలన జరుపుతుండగా...ఒకే అడ్రస్‌పై ఎక్కువ మంది ఓటర్లు నమోదైనట్లు గుర్తిస్తున్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో ఒకే చిరునామాపై 146 మందికి ఓటరు కార్డులు ఉండడాన్ని గుర్తించారు. దీనిపై సమీక్ష జరుపుతున్నారు.

బస్తీ మొత్తం ఒకే చిరునామాతో..
ఒకే చిరునామాలో ఎక్కువమంది ఓటర్లుండటంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయగా.. బస్తీ వారందరి ఓట్లు ఒకే చిరునామాలో ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం వాటిని సరిదిద్దే చర్యలు చేపట్టాం. తెలిసో, తెలియకో బై నెంబర్లు కూడా ఒకే విధంగా ఉండటంతో ఒకే ఇంట్లో ఉన్నారా? అనే అనుమానంతో పరిశీలించగా ఈ విషయం తెలిసింది. ఎక్కడ ఎక్కువ ఓటర్లున్నా పరిశీలన చేస్తాం. రాజకీయపార్టీలకు సైతం ఈ విషయంలో అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పార్టీల నేతలతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తూ క్లెయిమ్స్‌, అభ్యంతరాల గురించి తెలియజేస్తున్నాం. జాబితాలో కొత్తగా చేరినవారి వివరాలు, తొలగించిన వారి వివరాలు తెలియజేస్తున్నాం. ఓటరుజాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– దశరథ్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఈఆర్‌ఓ

మరిన్ని వార్తలు