తిరస్క‘రణం’

21 Nov, 2023 08:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థులకు ‘నోటా’గుబులు పట్టుకుంది. నువ్వా..నేనా అనే విధంగా పోరు నెలకొన్న స్థానాల్లో ప్రతి ఒక్క ఓటు ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో అవగాహన లోపంతో ‘చెల్లని ఓట్లు’ గెలుపు ఓటములపై ప్రభావం చూపగా.. తాజాగా ఈవీఎం ఓటింగ్‌లో అభ్యర్థులను తిరస్కరించే ‘నోటా’ తలరాతను తారుమారు చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్ల క్రితం వరకు ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పోటీచేసే అభ్యర్థులందరూ నచ్చకపోతే ఓటర్లు ఓటింగ్‌కు దూరం పాటించే వారు. కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ పేరుతో సదుపాయాన్ని అందుబాటులో తేవడంతో తిరస్కరణ ఓటింగ్‌ విస్తృతంగా పెరుగుతూ వస్తోంది. దీని ప్రాధాన్యం ఎంతవరకు వచ్చిందంటే క్రమంగా విజేతకు, ఓడిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు నమోదవుతూ వస్తున్నాయి. ఫలితంగా నోటా గెలుపోటములను నిర్ణయించే స్థాయికి చేరింది.

రెండు స్థానాలపై ప్రభావం

ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’ మీట నొక్కేయవచ్చు కానీ, కొన్ని స్థానాల్లో అభ్యర్ధుల గెలుపోటములను సైతం నోటా నిర్దేశించడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు పర్యాయాలుగా నోటా నొక్కే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కణతో కలిపి నోటా ఓటింగ్‌ పలువురు అభ్యర్థుల గెలుపు ఓటములకు కారణమైంది. నగరంతో పాటు శివారులో ఇద్దరు ముఖ్య నేతల ఓటమిలో ‘నోటా’ కీలక పాత్ర పోషించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని చోట్ల ఆధిక్యత ఓట్లు కంటే ‘నోటా’కు పోలైన ఓట్లే అధికంగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ప్రభావం ఇలా..

● గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్‌లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిగా సీనియర్‌ ఎమ్మెల్యే జి.కిషన్‌ రెడ్డి ఓటమికి ‘నోటా’ కారణమైంది. ఇక్కడ ‘నోటా’కు 1,462 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేశానికి 61,558 ఓట్లు రాగా, కిషన్‌న్‌రెడ్డికి 60,542 ఓట్లు లభించాయి. కిషన్‌్‌రెడ్డి కేవలం 1,016 తేడాతో ఓడిపోయారు.

● అదేవిధంగా నగర శివారులోని ఇబబ్రహీంపట్నంలో గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా నోటా ప్రభావం చూపింది. నోటాకు 1,151 ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 72,581 ఓట్లు సాధించి విజయం సాధించగా. మల్‌రెడ్డి రంగారెడ్డికి 72,205 ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు.

పోలింగ్‌లో 4 నుంచి 7వ స్థానంలోకి..

గ్రేటర్‌ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓటింగ్‌ శాతంలో నోటా నాలుగు నుంచి ఏడో స్థానం వరకు దక్కించుకుంది. మొత్తం పోలైన ఓటింగ్‌లో ప్రధాన పార్టీల తర్వాత స్థానాలు నోటాకు దక్కాయి. చిన్నా చితకా పార్టీలు స్వతంత్రులు సైతం నోటా ఓట్ల కంటే వెనకబడిపోయారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 16 నుంచి 36 మంది అభ్యర్థుల వరకు పోటీ చేశారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన స్థానం పరిశీలిస్తే ముషీరాబాద్‌, అంబర్‌పేట, సనత్‌నగర్‌, గోషామహల్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, శేరిలింగంపల్లిలలో నోటాకు 4వ స్థానం దక్కగా, మలక్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట, మల్కాజిగిరి, కుత్బుల్లాపుర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, మహేశ్వరం అసెంబ్లీ స్ధానాలు ఐదో స్థానంలో నిలిచాయి. జూబ్లీహిల్స్‌, చార్మినార్‌, బహదూర్‌పురా, కంటోన్మెంట్‌, రాజేంద్రనగర్‌ ఆరో స్థానంలో, యాకుత్‌పురా, ఇబ్రహీంపట్నంలలో నోటా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. చిన్నా చితకా రాజకీయ పార్టీలతో సమానంగా ఓట్లు సాధిస్తున్న ‘నోటా’ ఓటింగ్‌ భవిష్యత్తులో అభ్యర్థులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గత పదేళ్లుగా..

ఓటర్లకు ఇష్టం ఉన్నా.. లేకున్నా ఎవరికో ఒకరికి ఓటేసే బదులు అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓటేసే వేసే వెసులుబాటును భారత ఎన్నికల కమిషన్‌ కల్పించింది. పదేళ్ల క్రితం నోటా ఓటింగ్‌ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఒకవేళ ఓ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో నోటాకు ప్రాధాన్యం పెరిగింది. నోటా ఆప్షన్‌ను మన దేశంలో అక్షరాస్యులు మాత్రమే వినియోగిస్తున్నారు. ఓటింగ్‌కు హాజరు కానివారిపై ఈసీ దృష్టి సారించింది.

గ్రేటర్‌ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా..

ప్రధాన పక్షాల అభ్యర్థుల్లో నోటా గుబులు

అసెంబ్లీ పోలైన

నియోజకవర్గం నోటా ఓట్లు

శేరిలింగంపల్లి 3637

మేడ్చల్‌ 3402

మల్కాజిగిరి 3391

ఎల్‌బీనగర్‌ 3085

కుత్బుల్లాపుర్‌ 2976

ఉప్పల్‌ 2712

మహేశ్వరం 2171

కూకట్‌పల్లి 2134

ముషీరాబాద్‌ 1664

అంబర్‌పేట 1462

సికింద్రాబాద్‌ 1582

కంటోన్మెంట్‌ 1571

జూబ్లీహిల్స్‌ 1547

పటాన్‌న్‌ చెరు 1487

సనత్‌నగర్‌ 1464

ఖైరతాబాద్‌ 1371

బహదూర్‌పురా 1210

ఇబ్రహీంపట్నం 1151

చాంద్రాయణగుట్ట 1010

కార్వాన్‌ 938

మలక్‌పేట 920

యాకుత్‌పురా 799

నాంపల్లి 793

గోషామహల్‌ 709

చార్మినార్‌ 614

విజేతకు, ఓడిన అభ్యర్థికి మధ్య స్వల్ప ఓట్ల తేడా

గత ఎన్నికల్లో రెండు స్థానాల ఫలితాలపై ప్రభావం

గెలుపోటముల ను నిర్ణయించే శక్తిగా ఆవిర్భావం

మరిన్ని వార్తలు