కోకాపేట్‌.. హాట్‌ కేక్‌! బంగారం కంటే ఎంతో విలువైన భూమి

8 Jul, 2023 08:46 IST|Sakshi

నియో పోలిస్‌లో అపరిమిత అంతస్తులు

రెండో దశ అమ్మకాలకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌

మొత్తం 7 ప్లాట్లలో అమ్మకానికి 45.33 ఎకరాలు

వచ్చే నెల 3న రెండు విడతలుగా భూముల వేలం.. ఎకరా కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయం

హైదరాబాద్: కోకాపేట్‌ ఇప్పుడు ఒక హాట్‌కేక్‌. అక్కడ భూమి బంగారం కంటే ఎంతో విలువైంది. మహా నగరానికి పడమటి వైపున ఆకాశ హర్మ్యాలతో అలరారే కోకాపేట్‌ అంతర్జాతీయ హంగులతో దేశ విదేశాలకు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రోకు అందుబాటులో ఉ న్న కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన నియోపోలిస్‌ లేఅవుట్‌లో రెండో దశ ప్లాట్‌ల అమ్మకాలకు సన్నాహాలు చేపట్టింది.

విశాలమైన రహదారులు.. అత్యాధునిక సదుపాయాలు
సుమారు వంద ఎకరాలకుపైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌లో మొదటి దశలో ఎకరం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల చొప్పున 64 ఎకరాలను విక్రయించారు. తాజాగా మరో 7 ప్లాట్‌లలో విస్తరించిన ఉన్న 45.33 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఈసారి ఎకరా కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆన్‌లైన్‌ వేలం ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు కూడా అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. విశాలమైన రహదారులతో, అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది.

హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నాలెడ్జ్‌ సొసైటీకి చేరువలో ఉన్న నియోపోలిస్‌ లే అవుట్‌ చుట్టూ 5 కిలోమీటర్‌ల పరిధిలోనే అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఫార్ట్చూన్‌ 500 కంపెనీలు ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్‌ నెలకొంది.పైగా బహుళ వినియోగ అనుమతులు ఉండడంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్‌లు, డెవలపర్లు నియోపోలిస్‌ కోసం పెద్ద ఎత్తున పోటీపడనున్నారు.

మొదటి దశలో ఒకటి నుంచి 5 ప్లాట్‌ వరకు విక్రయించగా ప్రస్తుతం 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్‌లలో భూమిని అమ్మకానికి పెట్టారు. ప్లాట్‌ల సైజు మేరకు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల భూమి ఉంది.ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటో తేదీ వరకు డిపాజిట్‌ చెల్లించేందుకు గడువు విధించారు. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు.

ప్రత్యేకతలెన్నో..
సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉన్న నియోపోలిస్‌ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

సైకిల్‌ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్ల, 36 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నాయి. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర అన్ని రకాల భవనాలకు అనుమతులు ఇచ్చారు.

నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరౖకైనా హైరైజ్‌ బిల్డింగ్‌లను నిర్మించవచ్చు.

ఔటర్‌ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌ సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది.

ఈ నెల 20న ప్రీబిడ్‌ మీటింగ్‌..
నియోపోలిస్‌ రెండో దశ భూముల వేలంపై ఈ నెల 20న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు తదితర కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సింగిల్‌విండో పద్ధతిలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు