ఏదయా.. ఉస్మా‘నయా’

14 Sep, 2023 08:10 IST|Sakshi

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణంతో పాటు ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. పేద రోగుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినదించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే సచివాలయ నిర్మాణం ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. పాతబస్తీలోని మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఒవైసీ సోదరులు ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్‌ చేశారు.

గురువారం నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అయిదు రోజుల పాటు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు పల్లం ప్రవీణ్‌, బొంగు రమేష్‌, అజ్మీరా రంగా, లాలూ నాయక్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. – అఫ్జల్‌గంజ్‌

మరిన్ని వార్తలు