అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్‌ 17’‘సెప్టెంబర్‌ 17’: బీజేపీ Vs కాంగ్రెస్‌.. తెలంగాణలో పొలిటికల్‌ ప్రకంపనలు

17 Sep, 2023 07:20 IST|Sakshi

హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్‌ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో శనివారం నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిటీలోనే ఉన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి వీరు హాజరవుతారు. మరోపక్క తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు.

ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్‌ గ్రౌండ్‌, ఇటు పబ్లిక్‌ గార్డెన్స్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌, నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. ట్రాఫిక్‌ మళ్లింపులు దృష్టిలో పెట్టుకుని నగర వాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి కంటే ముందే బయలుదేరాలని పోలీసులు కోరుతున్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా.. పబ్లిక్‌ గార్డెన్స్‌ కేంద్రంగా ..

ఎంజే మార్కెట్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌ వైపు వచ్చే వాహనాలను తాజ్‌ ఐలాండ్‌ నుంచి ఏక్‌ మినార్‌ వైపు మళ్లిస్తారు.

నాపంల్లి రైల్వే స్టేషన్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్‌ రోడ్‌ టీ జంక్షన్‌ నుంచి మళ్లిస్తారు.

నిరంకారి నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్‌ భవన్‌ వైపు పంపిస్తారు.

బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మినార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌ నగర్‌ల వైపు నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌ వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో పంపిస్తారు.

పరేడ్‌ గ్రౌండ్స్‌ కేంద్రంగా..

ప్లాజా ఎక్స్‌ రోడ్‌ నుంచి ఎస్‌బీఐ చౌరస్తా మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. వైఎంసీఏ ఫ్లైఓవర్‌ పై నుంచి మాత్రమే ట్రాఫిక్‌ అనుమతిస్తారు.

బోయిన్‌పల్లి–తాడ్‌బండ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఓ వైపు మళ్ళిస్తారు. కార్ఖానా–జేబీఎస్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను స్వీకార్‌ ఉపకార్‌ నుంచి టివోలీ వైపు పంపిస్తారు.

ఆర్పీ రోడ్‌ నుంచి ఎస్బీహెచ్‌ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్‌ లేదా క్లాక్‌ టవర్‌ వైపు మళ్లాల్సి ఉంటుంది.

హాల్‌ టికెట్లు చూపించాలి...
ఆదివారం నగరం వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్న చోట్లా ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు చూపించిన వారిని బారికేడింగ్‌ పాయింట్లు దాటి ముందుకు పంపాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు