అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌కు రూ.4.33 కోట్లు టోకరా

30 Oct, 2023 05:02 IST|Sakshi

హైదరాబాద్: తాను పని చేస్తున్న సంస్థ ద్వారా పొందిన కార్పొరేట్‌ క్రెడిట్‌ కార్డుతో ఓ వ్యక్తి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌కు రూ.4.33 కోట్లు టోకరా వేశాడు. దీనికోసం అతగాడు బ్యాంక్‌ సెక్యూరిటీ అలెర్ట్‌ సిస్టంను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమాజిగూడలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకులో నగరానికి చెందిన కిండ్రిల్‌ సొల్యూషన్స్‌ సంస్థ కార్పొరేట్‌ క్రెడిట్‌ కార్డు సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన బ్యాంకు అధికారులు 2022లో అనుమతి ఇచ్చారు.

దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈ బ్యాంకు నుంచి కార్పొరేట్‌ క్రెడిట్‌ కార్డులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఆ సంస్థలో పనిచేసే యార్లగడ్డ ప్రదీప్‌కు కార్డు జారీ అయ్యింది. ఈ కార్డు వినియోగదారుడికి బ్యాంకు ఎలాంటి లిమిట్‌ నిర్దేశించదు. నిబంధనలకు లోబడి కంపెనీనే దీన్ని నిర్దేశిస్తుంటుంది. ఈ సంస్థలో పని చేసిన ప్రదీప్‌ భారీ కుట్ర చేశాడు.

బ్యాంకింగ్‌ అలర్ట్స్‌ సిస్టమ్‌ను తప్పుదోవ పట్టిస్తూ, సీఆర్‌ఈడీ అప్లికేషన్‌ను ఉపయోగించి దఫదఫాలుగా రూ. 4,33,52,612 లావాదేవీలు చేశాడు. ఈ ఏడాది మార్చి–ఆగస్టు మధ్య చేసిన ఈ లావాదేవీలకు సంబంధించిన మొత్తం అతడి బ్యాంక్‌ ఖాతాతో పాటు మరికొన్నింటిలోకీ వెళ్లింది. ఈ మొత్తం రీ పేమెంట్‌ జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో అతడు కొన్నాళ్లుగా విధులకు హాజరు కావట్లేదని తేలింది. ఇతడు ఎక్కువ లావాదేవీలు మేక్‌ మై ట్రిప్‌ యాప్‌ ద్వారా జరిపినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు అసలు ఈ మోసం ఎలా జరిగింది? ప్రదీప్‌ నగదు ఎలా కొట్టేశాడు? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు