హిందువులు ఓటుబ్యాంకుగా మారాలి

19 Nov, 2023 05:30 IST|Sakshi
కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌లో మాట్లాడుతున్న బండి సంజయ్‌   

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మోసాలను ముస్లింలు గుర్తించాలి 

నాందేడ్‌–భైంసా–మంచిర్యాల రైల్వే లైన్‌ వేయిస్తాం 

కేసీఆర్‌కు ఓవైసీ సోదరులతో చాలీసా చదివించే దమ్ముందా? 

భైంసా, కరీంనగర్‌ ఎన్నికల సభల్లో బండి సంజయ్‌ ­

నిర్మల్‌: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్‌ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్‌ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో ముధోల్‌ నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్‌ తరఫున శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు బండి సంజయ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని, వాళ్ల మేనిఫెస్టో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ 1,400 మందిని బలితీసుకుందని, నాటి బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ పార్లమెంటులో పోరాడిన తర్వాతే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని సంజయ్‌ గుర్తుచేశారు. 

భైంసాను మైసాగా మారుస్తాం.. 
బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం భైంసాను మైసాగా మారుస్తామని, ముధోల్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బండి సంజయ్‌ తెలిపారు. నాందేడ్‌ నుంచి భైంసా–నిర్మల్‌ మీదుగా మంచిర్యాల వరకు రైల్వేలైన్‌ వేయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో భైంసాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

ముధోల్‌లో గత ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్‌ మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల సభకే వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్లముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను దాచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు.  

ముస్లిం సమాజం ఆలోచించాలి... 
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు. టోపీలు పెట్టుకొని నమాజ్‌ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముస్లిం సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడా మతకలహాలు జరగలేదు’అని బండి సంజయ్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మాటలు నమ్మితే మోసపోతారని హెచ్చరించారు.

టవర్‌ సర్కిల్‌ వద్దకు రా... 
కరీంనగర్‌టౌన్‌: ‘ముస్లిం ఓట్ల కోసం సిగ్గులేకుండా టోపీ పెట్టుకుని మసీదుల్లోకి వెళ్లి నమాజ్‌ చేస్తున్న గంగుల, కేసీఆర్‌లు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్‌ ఆలయానికి తీసుకొచ్చి చాలీసా చదివించే దమ్ముందా?’అంటూ బండి సంజయ్‌ మరోసారి సవాల్‌ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అవినీతిపరుడినంటూ గంగుల చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు.

‘నేను ఎటువంటివాడనో కరీంనగర్‌ ప్రజలకు తెలుసు. నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్‌ బిస్తర్‌ సర్దుకుని రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రానికి కేసీఆర్, కరీంనగర్‌కు గంగుల కమలాకర్‌ చేసిందేమీ లేదన్నారు. గంగుల.. కేసీఆర్‌ను ఒప్పించి కరీంనగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

టవర్‌ సర్కిల్‌ వద్దకు రా.. స్మార్ట్‌సిటీ నిధులు ఎవరు ఇచ్చారో తేల్చుకుందాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులకు టిక్కెట్‌ ఇవ్వకపోతే దారుస్సలాం వెళ్లి మోకరిల్లితే ఎంఐఎం సాయంతో టిక్కెట్‌ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు