రద్దీ వేళల్లో ఎక్కడిక్కడ ఆగిన ట్రాఫిక్‌

11 Nov, 2023 10:00 IST|Sakshi

హైదరాబాద్: దీపావళి ఎఫెక్ట్‌ నగర రహదారులపై శుక్రవారమే కనిపించింది. దీనికి తోడు ‘ఎన్నికల ప్రభావం’ కూడా ఉంది. వెరసీ.. నగరంలో ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వీటి వేగం నత్తలతో పోటీ పటడంతో వాహన చోదకులకు నరకం కనిపించింది. అనేక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీపావళి నేపథ్యంలో రహదారులపై తాత్కాలిక బాణాసంచా దుకాణాలు వెలిశాయి. వీటితో పాటు ప్రమిదలు తదితరాలు విక్రయించే వారు కూడా ఫుట్‌పాత్‌లపై సరుకులు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపట్టారు.

ఈ కారణంగా క్యారేజ్‌వేలు దుకాణాలు, చిరు వ్యాపారులతో నిండిపోయాయి. ఖరీదు చేయడానికి వచ్చినవారు అనివార్యంగా తమ వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వచ్చింది. ఈ ప్రభావం రహదారిపై ఉన్న ట్రాఫిక్‌పై పడింది. దీపావళి నేపథ్యంలో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ పంచిపెట్టే ఆనవాయితీ ఉంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ పంపకాలన్నీ దాదాపు శుక్రవారమే పూర్తి చేశారు. వీటిని ఖరీదు చేయడానికి ఆయా దుకాణాల వద్ద వినియోగదారులకు బారులు తీరారు. వీరి వాహనాల కారణంగా ఆ రహదారులు ఇరుకై పోయాయి. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక చోట్ల ట్రాఫిక్‌ ఆగడం, అతి నెమ్మదిగా సాగడం తప్పలేదు.

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. దీనికోసం రిటర్నింగ్‌ అధికారులుగా నియమితులైన రెవెన్యూ అధికారుల కార్యాలయాల వద్ద పోలీసులు ‘100 మీటర్ల’ బారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఆయా రహదారులు కుంచించుకుపోయాయి. ఈ పరిణామాలకు తోడు నామినేషన్లు చేయడానికి వెళ్లే అభ్యర్థులు, వారి వెంట వచ్చే అనుచరులు, వాహనాలు తదితరాల నేపథ్యంలోనే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు. ఇవి చాలవన్నట్లు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో భారీగా రద్దీ నెలకొంది.

మరిన్ని వార్తలు