ఆగమేఘాల కమలం

11 Nov, 2023 04:28 IST|Sakshi
బీజేపీ తుది జాబితాలో మార్పులు చేర్పులు

ఉదయం జాబితా.. బీ ఫాంల అందజేత

మధ్యాహ్నం నామినేషన్ల దాఖలుకు పరుగులు

మేడ్చల్‌, కంటోన్మెంట్‌లకు మారిన అభ్యర్థులు

శేరిలింగంపల్లికి రవికుమార్‌, చాంద్రాయణగుట్టకు మహేందర్‌

నాంపల్లి స్థానానికి రాహుల్‌ చంద్ర..

సాక్షి, సిటీబ్యూరో: అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనల నుంచి బీఫాంల జారీ.. నామినేషన్ల దాకా అంతా సజావుగా సాఫీగా సాగగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల్లో చివరి క్షణం దాకా జాప్యం.. అభ్యర్థుల పేర్ల మార్పు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కాగా గురువారం రాత్రి వరకు గ్రేటర్‌ పరిధిలో బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆగమేఘాలపై అభ్యర్థులను ఖరారు చేసి వారికి నేరుగా ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారని పార్టీ నేతలు పేర్కొన్నారు. తమకు ఫోన్లు వచ్చినట్లు పేర్కొన్న కొందరిలో శుక్రవారం ప్రకటించిన అధికారిక జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో కంగు తిన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గానికి మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారమిచ్చి.. ఆయన స్థానంలో అక్కడ ఏనుగు సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో విక్రమ్‌రెడ్డి రెబెల్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. కంటోన్మెంట్‌లో తొలుత మాజీ పోలీస్‌ ఉన్నతాధికారి కృష్ణప్రసాద్‌ పేరు ఖరారైనట్లు చెప్పి.. తీరా జాబితాలో శ్రీగణేశ్‌ నారాయణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా తొలుత ప్రకటించిన సత్యనారాయణ అస్వస్థత దృష్ట్యా తాను పోటీ చేయలేనని తెలపడంతో ఆయన స్థానంలో మహేందర్‌కు టికెట్‌ కేటాయించారు. ఇక శేరిలింగంపల్లిలో రవికుమార్‌, నాంపల్లిలో రాహుల్‌చంద్రను అభ్యర్థులుగా ప్రకటించారు. మల్కాజిగిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కనివారు పార్టీ తీరుపై కారాలు మిరియాలు నూరుతుండగా.. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు సమయం దగ్గరపడుతుండటంతో బీ ఫాంలతో ఆగమేఘాలపై నామినేషన్లు ఉరుకులు పరుగులతో సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు