కౌన్ బనేగా కిస్మత్ వాలా!

18 Nov, 2023 07:36 IST|Sakshi

హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఆశ. ఇందుకోసం గెలుపు కోసం ఓటర్లను, చోటు కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటుంటారు. ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పలువురు తాజా, మాజీ మంత్రులు గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి బరిలోకి దిగారు. వీరిలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వరుసగా రెండుసార్లు కేసీఆర్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకొని రికార్డు సృష్టించారు.

ఒకే శాఖకు రెండుసార్లు మంత్రిగా..
2014లో శాసనసభ ఎన్నికలలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీ టికెట్‌తో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌పై గెలుపొందారు. ఆ తర్వాత తలసాని కారెక్కి, కేసీఆర్‌ కేబినెట్‌లో చేరిపోయారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ టికెట్‌తో బరిలోకి దిగిన తలసాని వరుసగా రెండోసారి గెలుపొంది, మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. రెండోసారి కూడా ఇదే శాఖకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తలసాని మరోసారి సనత్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

తొలి మహిళా హోంమంత్రిగా..
కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ కండువాతో పోటీ చేసి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత సబితా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సమైక్య రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు దేశంలోనే తొలి మహిళా హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. సబితా మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు.

పార్టీలో చేరి.. కేబినెట్‌లోకి..
2014లో టీడీపీ పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి లోకసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలుపొందిన ఏకై క పార్లమెంట్‌ సభ్యుడు మల్లారెడ్డే. 2016లో మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 శాసనసభ ఎన్నికలలో మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌తో పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్‌ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ మేడ్చల్‌ నుంచి బరిలోకి దిగారు.

సికింద్రాబాద్‌ నుంచి డిప్యూటీ స్పీకర్‌..
1984, 2001లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేసిన పద్మారావు గౌడ్‌.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2004లో సికింద్రాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి శశిధర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసిన పద్మారావు గెలుపొందారు. తొలి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసి.. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోనిలిచారు

బరిలో మాజీ ‘ఉమ్మడి’ మంత్రులు..
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన కృష్ణ యాదవ్‌, మర్రి శశిధర్‌ రెడ్డి, దానం నాగేందర్‌ ఈసారి శాసనసభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్‌.. అంబర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా.. టూరిజం మంత్రిగా పనిచేసిన మర్రి.. బీజేపీ కండువాతో సనత్‌నగర్‌ నుంచి.. గతంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్‌ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు