Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్‌

20 Nov, 2023 08:54 IST|Sakshi

హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్‌గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి.

ఇటు కృష్ణ యాదవ్‌.. అటు పూస రాజు..
బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సెగ్మెంట్‌ అయిన అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్‌గా మారింది.

ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్‌దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్‌ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్‌గా ఉన్న లక్ష్మణ్‌.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్‌ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్‌ మీద పడింది. పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్‌ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది.

ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు
పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్‌ఎస్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్‌ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్‌లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్‌నగర్‌లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్‌లో ఆమెను గెలిపించాలి.

అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్‌ఎస్‌ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్‌లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్‌గా మారింది.

కాంగ్రెస్‌లో ఇలా..
ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌ఖేరా భార్య కోటా నీలిమ సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్‌గా మారింది.

మరిన్ని వార్తలు