కబ్జా చేద్దాం!

20 Nov, 2023 04:32 IST|Sakshi
ఇదే తరుణం.. సర్వే నెంబరు 342/1 ప్రభుత్వ స్థలంలో వెలసిన బస్తీ

కుత్బుల్లాపూర్‌: ఎన్నికలు భూకబ్జారాయుళ్లకు వరంగా మారాయి. ఎన్నికల విధుల్లో రెవెన్యూ అధికారులు తలమునకలై ఉండడంతో అక్రమార్కులకు మార్గం సుగమమైంది. వారం రోజుల వ్యవధిలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు వెలిశాయి. గాజుల రామారం డివిజన్‌ కై సర్‌ నగర్‌ ప్రధాన రహదారిని ఆనుకొని.. హనుమాన్‌ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వేనెంబర్‌ 342/1 ప్రభుత్వ స్థలం 80 శాతం మేర కబ్జాకు గురైంది. మిగతా 20 శాతాన్ని మరో రెండు రోజుల్లో కబ్జా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక సంఘం పేరిట మూడు చోట్ల బస్తీని ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆ సంఘం ‘పెద్ద్ఙ మూడు బస్తీల నుంచి 60 గజాల చొప్పున 60 ప్లాట్లు తీసుకుని ఎవరు వచ్చినా తాను చూసుకుంటానని ఒప్పందం కుదుర్చుకొని ఈ తతంగం నడిపిస్తున్నాడు. 60 గజాల చొప్పున ప్లాట్లు చేసి అమాయకులకు అంటగడుతూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నాడు. అంతేకాకుండా ఇదే సర్వేనెంబర్‌ ఆనుకొని ఉన్న 307, 329 ప్రభుత్వ స్థలాల్లో కబ్జాదారులు నిర్మాణాలను వేగవంతం చేశారు.

అప్పట్లో సాక్షి కథనంతో యంత్రాంగంలో కదలిక..
గాజుల రామారం పరిధి దేవేందర్‌ నగర్‌, కై సర్‌ నగర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలంలో వెలసిన నిర్మాణాలపై ఈ ఏడాది మే 13న ‘జస్ట్‌ మూడేళ్లు’, 14 న ‘కన్నేశారు అమ్మేశారు’ అనే శీర్షికలతో సాక్షి పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌ స్పందించారు. వెంటనే ఆ నిర్మాణాలను కూల్చివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో మే 16న పోలీసు బలగాల తో జిల్లా రెవెన్యూ యంత్రాంగం కదిలింది. 200 నిర్మాణాలను కూల్చివేసింది. ఇందుకు బాధ్యులుగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పరమేశ్వర్‌ రెడ్డిని, ముగ్గురు వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేస్తూ ఆర్డీవో మల్లయ్య, తహసీల్దార్‌ సంజీవరావును బదిలీ చేసింది. అప్పట్లో ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది.

మళ్లీ పుంజుకున్న నిర్మాణాలు..
అప్పటి నుంచి మౌనంగా ఉన్న కబ్జారాయుళ్లు గత కొన్ని రోజుల నుంచి రెచ్చిపోతున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడంతో అక్కడి స్థలాల ఆనవాళ్లే మారిపోయాయి.

ఇప్పటికే కేసులు నమోదు చేశాం
ప్రభుత్వం స్థలాల్లో కబ్జాల విషయమై ఇప్పటికే 11 మందిని గుర్తించి, వారిపై ఇటీవల కేసులు నమోదు చేశాం. ప్రస్తుతం ఇటీవల జరిగిన నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం.
– అబ్దుల్‌ రెహమాన్‌, కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌

మరిన్ని వార్తలు