ఎవరెవరు ఎక్కడెక్కడ..

22 Nov, 2023 05:30 IST|Sakshi

డీడీ కాలనీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ కోసం ప్రచారం చేస్తున్న భార్య పద్మ

● శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ భార్య శ్యామల దేవి, కూతురు ప్రణతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎం.రవి కుమార్‌ యాదవ్‌ తండ్రి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ నియోజకవర్గంలోని పలు చోట్ల జరిగిన రోడ్‌ షోలు, బూత్‌ స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. రవి కుమార్‌ యాదవ్‌ సోదరి విజయలక్ష్మి, ఆయన భార్య హరిణి కూడా ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

● కాంగ్రెస్‌ అభ్యర్థి వి.జగదీశ్వర్‌ గౌడ్‌ భార్య, హఫీజ్‌ఫేట్‌ కార్పొరేటర్‌ అయిన పూజిత జగదీశ్వర్‌ గౌడ్‌, ఆయన కూతురు హారికలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

● ఉప్పల్‌ బీజీపీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ గెలుపు కోసం ఆయన ఇద్దరు కూతుళ్లు ధనలక్ష్మి, మహాలక్ష్మి ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాలనీల్లో పాదయాత్రలు చేస్తున్నారు.

● కాంగ్రెస్‌ అభ్యర్థి మందుముల పరమేశ్వర్‌రెడ్డి విజయం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, ఉప్పల్‌ కార్పొరేటర్‌ అయిన ఆయన భార్య రజిత రంగంలోకి దిగారు. పరమేశ్వర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రజిత గత 60 రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

● యాకుత్‌పురా నియోజక వర్గం నుంచి ఎంబీటీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ కార్పొరేటర్‌ అంజదుల్లాఖాన్‌ను గెలిపించడానికి ఆయన అన్న ఫర్హతుల్లాఖాన్‌ శాయశక్తులా కష్టపడుతున్నారు. మంగళవారం నియోజక వర్గంలోని పలు బస్తీలలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేసి ఈ ఎన్నికలలో తన తమ్ముడిని గెలిపిస్తే..స్థానికులకు అవసరమైన కనీస సౌకర్యాలన్నింటిని కల్పించడానికి కృషి చేస్తాడని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

● చార్మినార్‌ బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్‌ విజయం కోసం ఆమె భర్త ఉమేష్‌ అగర్వాల్‌, తమ్ముడు పంకజ్‌కుమార్‌ అగర్వాల్‌లు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఆమెను గెలిపించడానికి శాయశక్తులా పోరాడుతున్నారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలలో ఒకరు మైక్‌ పట్టుకుని అనౌన్స్‌ చేస్తుండగా..మరొకరు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కరపత్రాలు పంచుతూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

● మేడ్చల్‌లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబసభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి కి తోడుగా ఆయన సోదరుడు సీఎంఆర్‌ కళాశాల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఆయన కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి కోడళ్ళు ప్రీతీ రెడ్డి, శాలిని రెడ్డి లు వారి బంధువులు మొత్తం ఎన్నికల రంగంలోకి దిగారు.

● కాంగ్రెస్‌ అభ్యర్ధి వజ్రేష్‌యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు అజయ్‌ యాదవ్‌ అన్నీ తానై నడిపిస్తుండగా భార్య లక్ష్మి, కుమార్తె డాక్టర్‌ స్పందన, కోడలు సరిత, బంధువులు ప్రచారంలో పాల్గొంటున్నారు.

బీజేపీ అభ్యర్థి మెఘారాణి వెన్నంటి ప్రచారం నిర్వహిస్తున్న భర్త ఉమేష్‌ అగర్వాల్‌, తమ్ముడు పంకజ్‌కుమార్‌ అగర్వాల్‌

మరిన్ని వార్తలు