25 నుంచి మరింత ఉద్ధృతంగా..

22 Nov, 2023 07:49 IST|Sakshi

హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ రాజధాని నగరం హైదరాబాద్‌పై దృష్టి సారించాయి. మూడు జిల్లాల పరిధిలోని 29 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ‘టార్గెట్‌– హైదరాబాద్‌’ లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు.

బీజేపీ అగ్రనేతలు కొందరు ఇప్పటికే నగరానికి వచ్చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సికింద్రాబాద్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేందర్‌ ఫడ్నవీస్‌ సైతం ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కంటోన్మెంట్‌లో పర్యటించారు. పలు సమావేశాల్లో ప్రసంగించారు.

తుది దశకు చేరుకోవడంతో..
 ► రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదును పెట్టాయి. సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు, సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వివిధ వర్గాలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. మహిళలు, నిరుద్యోగులు, ఐటీ నిపుణులు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకొని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ సైతం ఎక్కడికక్కడ ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాయి.

25 నుంచి మరింత ఉద్ధృతంగా..

బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 25న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నిర్వహిస్తోన్న ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలుచోట్ల జరగనున్న సభలు, ర్యాలీలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన పాల్గొననున్నారు. 25న మహేశ్వరంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. 27వ తేదీన నగరంలో రోడ్‌షోలో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ నగరంలో మకాం వేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ తదితర అగ్రనేతలంతా హైదరాబాద్‌తో పాటు వివిధ చోట్ల జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు