బరిలోకి బడా నేతలు

22 Nov, 2023 04:35 IST|Sakshi

ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ అతిరథ మహారథులు 

నేడు అలంపూర్, నల్లగొండల్లో ఖర్గే పర్యటన ..  

24న రాహుల్, ప్రియాంక రాక.. సోనియానూ రప్పించాలని యోచన 

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ ఏఐసీసీ నేత

ప్రతిరోజూ ఉండేలా టీపీసీసీ ప్లాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రచార పర్వం మరో వారం రోజులే మిగిలిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ బడా నేతలను రంగంలోకి దింపుతోంది. ఎన్నికల్లో చాలా కీలకమైన ఈ వారం రోజుల పాటు బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి పంపడం ద్వారా ప్రచార రేసులో ఇతర పార్టీల కంటే ఎక్కడా వెనకబడ్డామనే భావన కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాందీ, అగ్రనేత రాహుల్‌ గాందీలతో పాటు వీలును బట్టి సోనియాగాందీని కూడా చివరి వారంలో బరిలోకి దింపనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజూ ఏఐసీసీకి చెందిన ఓ ముఖ్య నేత ప్రచారం ఉండేలా సునీల్‌ కనుగోలు టీం షెడ్యూల్‌ రూపొందిస్తోంది.  

హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంగళవారం సాయంత్రమే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, నేతలు హర్కర వేణుగోపాల్, ఫహీమ్‌ తదితరులు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి హోటల్‌ తాజ్‌కృష్ణకు వెళ్లిన ఖర్గే అక్కడ రాష్ట్ర పార్టీ  నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆయన ఆలంపూర్, నల్లగొండల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్‌గాంధీ ఈనెల 24న తెలంగాణకు వస్తున్నారు. ఆయన 28వ తేదీ వరకు ఇక్కడే ఉంటారని గాందీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఆయన ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఏయే నియోజకవర్గాల్లో పర్యటించాలన్న దానిపై సునీల్‌ కనుగోలు టీం కసరత్తు చేస్తోంది.  

10 నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం 
మరోవైపు ప్రియాంకాగాంధీ కూడా ఈనెల 24వ తేదీనే తెలంగాణకు వస్తున్నారు. పాలకుర్తిలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న ప్రియాంక 25, 27 తేదీల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఆమె ఈ దఫాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇలావుండగా సోనియాగాందీని కూడా చివరి వారంలో ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ యోచిస్తోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏఐసీసీ వెనుకా ముందాడుతోందని, ఒకవేళ సోనియా పర్యటన ఖరారైతే 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆమె సభ ఉంటుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

పరిస్థితేంటి?: కేసీవీ ఆరా 
ఎన్నికల ప్రచార సరళి, పార్టీ అభ్యర్థుల పనితీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరా తీశారు. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పార్టీ పరిశీలకులు, పార్లమెంటు ఇన్‌చార్జులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పీసీసీ ముఖ్య నేతలతో జూమ్‌ ద్వారా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీల కంటే ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకబడకూడదని, ఈ మేరకు అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని పరిశీలకులు, సమన్వయకర్తలకు ఆయన సూచించారు. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలోని కీలకాంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.      

మరిన్ని వార్తలు