ఓటు ఎవరికి అంటే.. కాకే మన ఆదర్శం!

29 Nov, 2023 10:16 IST|Sakshi

‘‘కాకిని ఆదర్శంగా తీసుకుంటే ఓటును సరిగా వేయొచ్చు’’ అంటూ విలక్షణంగా  సెలవిచ్చారు స్వామి ఎలక్షనానంద అలియాస్‌ స్వామి సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అయోమయంగా అడిగాడు శిష్యుడు. ‘‘కథల్లో కాకుల్నీ, కాకమ్మ కథల్నీ గుర్తు పెట్టుకుంటే ఓటు వేయడంలో పొరబాట్లు జరగవు. చెబుతా విను’’ అంటూ తన స్టేట్‌మెంట్‌ను పునరుద్ఘాటిస్తూ, దానికి తగిన దాఖలా కూడా ఇచ్చారు స్వామీజీ.

‘‘అనగనగా ఓ కాకి. అదెంతో కష్టపడి ఓ మాంసం ముక్కను సంపాయించుకుంది. పక్షి ప్రపంచంలో కాకి పిల్లే కాకుండా..కాకి తిండీ కాకికి ముద్దే. దాని భోజనం దానికి పవిత్రమే కదా..అచ్చం మనలోకంలో మన ఓటులాగే.కాకి నోటనున్న మాంసం ముక్కను చూసి, నక్కకు నోరూరింది. అది చెట్టుకిందికి వచ్చి.

‘‘కాకి బావా... కాకి బావా... గానగంధర్వులంటూ మనుషులేవో తప్పుడు కూతలు కూస్తూ ఉంటారుగానీ..పాటంటే అసలు నీదే కదా. పక్షుల్లో పి.సుశీల నువ్వే కదా’’ అని పొగుడుతుంది.  ఆ పొగడ్తలకు పరవశించిన కాకి గొంతెత్తి పాడుతుంది. అంతే..కాకి నోటనున్న నల్లి బొక్క సహిత మాంసం ముక్క కాస్తా నక్కకు దక్కుతుంది. కాకి తెలివైనదే. కానీ ఎవరి తెలివితేటలైనా అవి ఒక రంగానికే పరిమితం.

కాకికి కాస్త సైన్సుతోపాటు బోలెడంత యుక్తి కూడా తెలుసు. కాకి యుక్తిని తెలిపే కథ మరొకటుంది. కాకి, జింక, ఎలుక ఈ మూడూ ఫ్రెండ్సు. ‘నన్ను కూడా మీ గ్రూపులో చేర్చుకొమ్మంటుం’ది ఓ నక్క.

బోలెడంత డౌటు పడుతూనే, తప్పని పరిస్థితుల్లో  దాంతో ఫ్రెండ్షిప్‌ చేస్తాయి కాకి, జింక, ఎలుక.  ఓ పక్క ఫ్రెండ్‌షిప్‌ నటిస్తూనే జింకను ఉచ్చులో చిక్కేలా చేస్తుంది నక్క. ‘నక్కబావా.. నక్కబావా ఉచ్చు కొరికి నన్ను విడిపించవా’ అని అడుగుతుంది జింక. ‘‘ఉచ్చును జంతునరంతో చేస్తారు. ఇవాళ్ల శనివారం కదా. నేను నాన్‌వెజ్‌ ముట్టను. కాస్త వెయిట్‌ చెయ్‌. రేపొచ్చి విడిపిస్తానం’’టూ వేటగాడొచ్చి జింకను చంపడం కోసం దూరంగా వెళ్లి వేచిచూస్తుంటుంది.

సంగతంతా తెలుస్తుంది కాకికీ, ఎలుకలకు.  జింక దగ్గరికెళ్లి ఓ ఐడియా చెబుతుంది కాకి. ఆ ప్రకారం... జింక తన కడుపును ఉబ్బించి, చచ్చినట్టు నటిస్తూ పడి ఉంటుంది. జింక కంటిని పొడుస్తున్నట్టు యాక్షన్‌ చేస్తుంది కాకి. ఈలోపు వేటగాడు దూరం నుంచే చూసి, జింక చచ్చిందనుకుని వెళ్లిపోతాడు. ఇంతలో ఉచ్చు కొరికేస్తుంది ఎలుక. జింక సేఫ్‌.  ఇలా కాకికి కొంత సోషల్‌ ఎవేర్‌నెస్సు ఉంది. మరి కాస్త సైన్సు తెలుసంతే. అందుకే తనకు తెలిసిన సైన్స్‌తో గులకరాళ్లు కుండలో వేసి, అడుగునున్న నీళ్లను పైకి రప్పించగలిగింది.

ఇలా..దానికి ఫ్లుయిడ్‌ మెకానిక్స్‌ కొంత తెలుసుగానీ మ్యాథమేటిక్స్‌ అస్సలు తెలియదు. అందువల్ల..కోకిల తన గుడ్లను.. కాకి గూట్లో పెట్టి, దాంతోనే పొదిగించినా దానికి తెలియరాలేదూ..ఆ ఎక్స్‌ట్రా గుడ్లు ఎక్కణ్ణుంచి వచ్చాయోనన్న తెలివీ లేదు. సైన్సు తెలిసిన కాకికి మ్యాథ్సూ, సాంగ్సూ  తెలియాలనే  రూలేమీ లేదు కదా.  బల్బ్‌ కనిపెట్టినంత తేలిగ్గా ఎడిసన్‌ గారు బట్టలు నేయలేకపోవచ్చూ, బాదం హాల్వా చేయలేకపోవచ్చు కదా.

కాబట్టి దీన్ని బట్టి తెలిసే నీతి ఏమిటి? కాకి మాంసం ముక్క ఎంత విలువైనదో... మన నోటికాడికి కూడూ, గూడూ, గుడ్డా వచ్చేలా చేసే ఓటూ అంతే విలువైనది. దాన్ని తమ వశం చేసుకోడానికి చాలా మంది అభ్యర్థులు...‘ఓటర్లంతా తెలివైనవాళ్లు. వాళ్లెప్పుడూ తప్పుచేయరు’ అంటూ ఉబ్బేస్తూ ఉంటారు.

 
అందుకే  ప్రతి ఓటరూ తన బలమేమిటో తెలుసుకోవాలి. తనకు లేని బలాన్ని ఉన్నట్టుగా చూపే యుక్తుల్ని తెలుసుకుని తెలివిగా మసలాలి. అంతేకాదు... తెలివైన కాకిలా మనకు కావాల్సిన లబ్ధిని కుండలో నీళ్లలా సాధించుకోవాలి. మన సోషల్‌  ఎవేర్‌నెస్సుతో... మన ఫ్రెండ్సూ, నైబర్ల ఓట్లను కొట్టేయాలనుకునే నక్కజిత్తుల వాళ్లనూ, ముప్పు తెచ్చే వేటగాళ్లలాంటి వాళ్ల గురించి అప్రమత్తం చేయాలి.

అంతేతప్ప... తెలివైన ఓటరెప్పుడూ పొగడ్తలకు పొంగిపోయి, విలువైన ఓటును కాకి నోట మాంసం ముక్కలా అర్హత లేని అభ్యర్థుల పాలు చేయకూడదు’’ అంటూ ముగించారు స్వామి ఎలక్షనానంద.

ఇది చదవండి: ఓటరు దేవుడో... నీకో దండం  

మరిన్ని వార్తలు