చార్లీ ముంగెర్ మరణం.. రూ.64 లక్షల కోట్ల కంపెనీకి సహకారం

29 Nov, 2023 10:24 IST|Sakshi

ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే వైస్ ఛైర్మెన్ చార్లీ ముంగెర్(99) కాలిఫోర్నియా ఆసుపత్రిలో మరణించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. వారెన్ బఫెట్‌కు చార్లీ ముంగెర్ చాలా నమ్మకస్థుడు.

జనవరి 1924లో జన్మించిన ముంగెర్‌ మరణవార్తవిని వారెన్ బఫెట్ స్పందించారు. బెర్క్‌షైర్ హాత్వే ఈ స్థాయికి చేరుకోవడానికి చార్లీ సహకారం ఎంతో ఉందన్నారు. యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్ ముంగెర్‌కు నివాళులర్పించారు. ‘వ్యాపారంతోపాటు ఆయన​ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చార్లీ బాగా పరిశీలిస్తారు. సంస్థను నిర్మించడంలో తన నైపుణ్యాలు ఇతర నాయకులకు ప్రేరణగా ఉండేవి’అని టిమ్‌ తన ఎక్స్‌ ఖాతాలో అన్నారు. 

చార్లీ ముంగెర్ 1924లో ఒమాహాలో పుట్టి పెరిగారు. ముంగెర్, బఫెట్ 1959లో మొదటిసారి కలుసుకున్నారు. 1978లో బెర్క్‌షైర్ హాత్వే వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. బెర్క్‌షైర్ హాత్వేను టెక్స్‌టైల్ కంపెనీ నుంచి దాదాపు రూ.64 లక్షల కోట్ల విలువైన సంస్థగా మార్చడంలో ముంగెర్‌ కీలక పాత్ర పోషించారు. అతని ‘నో నాన్సెన్స్’ విధానంతో కోసం అమెరికన్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందారు. నాణ్యమైన కంపెనీలు గుర్తించి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో చార్లీ ముంగెర్‌ దిట్ట. ఆ కంపెనీల ఉత్పాదకత ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టి లాభం సంపాదించేవారు. ఆయన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ను ‘ర్యాట్‌ పాయిజన్’గా పిలిచేవారు.

మరిన్ని వార్తలు