తైవాన్‌లోకి ప్రవేశించిన చైనా ఫైటర్‌ జెట్స్‌.. క్షణక్షణం ఉత్కంఠ!

3 Aug, 2022 20:28 IST|Sakshi

తైపీ: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్‌లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్‌ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్‌ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్‌ జెట్స్‌ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది.

‘27 పీఎల్‌ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్‌ జెట్స్‌, 5 జే16 జేట్స్‌ 16 ఎస్‌యూ-30 జేట్స్‌ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్‌ సైతం తమ ఫైటర్‌ జెట్స్‌ను రంగంలోకి దించింది. ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్స్‌ని మోహరించింది. ’ అంటూ ట్వీట్‌ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్‌ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్‌. స్పీకర్‌ విజిట్‌పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్‌ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్‌లో భాగంగా లాంగ్‌ రేంజ్‌ షూటింగ్‌ వంటివి ‍ప్రదర‍్శించింది. దీంతో తైవాన్‌లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ.

ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్‌ పై కక్ష సాధింపు చర్యలు

మరిన్ని వార్తలు