‘మేం నలుగురం ఇంకా బతికే ఉన్నాం.. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’

7 Oct, 2022 08:01 IST|Sakshi

అమెరికాలో జాన్సన్‌ సిస్టర్స్‌గా పేరుగాంచిన ఓ నలుగురు అక్కచెల్లెళ్లు తీవ్ర వృద్ధాప్యంలోనూ ఇటీవల సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు! వారు నెలకొల్పిన రికార్డు కూడా ఆషామాషీదేం కాదు.. ఇప్పట్లో ఎవరూ దాన్ని బద్దలుకొట్టే అవకాశం కూడా లేదు! ఇంతకీ ఆ రికార్డు ఏమిటో తెలుసా? వారు నేటికీ జీవించి ఉండటమే!! అంటే ప్రపంచంలోనే అత్యధిక వయసున్న నలుగురు అక్కచెల్లెళ్లుగా వారు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించారన్నమాట.

ఆ సోదరీమణుల మొత్తం వయసు ఎంతో తెలుసా. ఏకంగా 389 సంవత్సరాలు! అందరిలో పెద్దామె అర్లోయెన్స్‌ జాన్సన్‌ ఓవర్‌స్కీ వయసు 101 ఏళ్లు కాగా, రెండో సోదరి మార్సిన్‌ జాన్సన్‌ స్కల్లీకి 99 ఏళ్లు, మూడో సోదరి డోరిస్‌ జాన్సన్‌ గాడినీర్‌కు 96 ఏళ్లు, చివరి సోదరి జెవెల్‌ జాన్సన్‌ బెక్‌కు 93 ఏళ్లు. 2022 ఆగస్టు 1 నాటికి వారంతా 389 ఏళ్ల 197 రోజులు జీవించి ఎక్కువకాలం జీవించిన అక్కచెల్లెళ్లుగా ఘనత సాధించారు.

తద్వారా 383 ఏళ్లతో నలుగురు తోబుట్టువుల పేరిట ఈ ఏడాది తొలినాళ్లలో నమోదైన గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టారు. రూత్‌ల్యాండ్‌లో జన్మించిన ఈ జాన్సన్‌ సిస్టర్స్‌... తరువాత యూఎస్‌లోని వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా... ప్రతి వేసవిలో మాత్రం తప్పక కలుసుకుంటారు. అయితే వయసు పైబడటంతో ఈమధ్య ఫోన్‌లోనే టచ్‌లో ఉంటున్నట్టు తెలిపారు. గిన్నిస్‌ రికార్డు కోసం ఎందుకు దరఖాస్తు చేయాలనిపించింది? అని అడిగితే... ‘మేం నలుగురం ఇంకా బతికే ఉన్నాం. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా!  

చదవండి: (Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు)

మరిన్ని వార్తలు