మంటల్లో కోవిడ్‌ ఆస్పత్రి.. 82 మంది మృతి

26 Apr, 2021 02:13 IST|Sakshi
పేలుడు తీవ్రతకు ఆస్పత్రి లోపల జరిగిన విధ్వంసం  

బాగ్డాద్‌లో ఘోర ప్రమాదం.. 82 మంది మృతి,   

ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో ఘటన

బాగ్దాద్‌: మహారాష్ట్రలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాదాలు స్ఫురించేలా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో కూడా ఘోరం జరిగింది. బాగ్దాద్‌లోని ఇబన్‌ అల్‌ఖతీబ్‌ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ ఉన్న అంతస్తులోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో వెంటిలేటర్‌ మీద ఉన్న 28 మంది రోగులు మంటలకి ఆహుతయ్యారు. మరికొందరు దట్టంగా వ్యాపించిన పొగతో ఊపిరాడక మరణించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలడంతో ఆరోగ్య మంత్రి హసన్‌ అల్‌ తమిమీని ప్రధాని సస్పెండ్‌ చేశారు.  

ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి ఆక్సిజన్‌ సపోర్ట్‌ మీద ఉన్న కొందరు రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టే దృశ్యాలు మనసుల్ని కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఆ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్‌ సీలింగ్‌లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్‌ అధికార ప్రతినిధి అలీ అల్‌–బయతి చెప్పారు.  అగ్నిమాపక సిబ్బంది  మంటల్ని అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సేపు శ్రమించారు. దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడారు.   

మరిన్ని వార్తలు