123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు?

19 Jun, 2021 13:01 IST|Sakshi

కీవ్‌(ఉక్రెయిన్‌): మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలకాలం అనురాగంతో సాగిపోవాలంటే.. నిజాయతీ తోడు కావాలి. పరిస్థితులను బట్టి సర్దుకుపోగలగాలి. ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది. దంపతులమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. వస్తే అది విడిపోవడానికి దారితీస్తుంది. 

తాజాగా ఉక్రెయిన్‌ చెందిన ఓ జంట తమ బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ప్రేమికుల దినోత్సవం రోజున చేతికి సంకెళ్లు వేసుకుని ఓ వినూత్న ప్రయోగం చేశారు. అయితే ఎట్టకేలకు ఈ జంట తమ చేతి సంకెళ్లను ఉక్రెయిన్‌కు చెందిన ఓ టీవీ న్యూస్ ఛానల్ ముందు తొలగించారు. అలెగ్జాండర్ కుడ్లే(33), విక్టోరియా పుస్టోవిటోవా(29) అనే ఉక్రెయిన్‌ యువ దంపతులు 123 రోజుల పాటు తమ చెరో చేతికి సంకెళ్లు వేసుకుని గడిపారు. కిరాణా షాపింగ్‌ నుంచి బాత్రూమ్‌, షవర్‌ చేసుకోవడం ప్రతిదీ కలిసే చేశారు. అయితే ఈ ప్రయోగం వల్ల కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు.

ఈ విధంగా కలిసి ఉండటం వల్ల తన ప్రియుడు తనపై అంత శ్రద్ధ చూపలేదని ఆమె పేర్కొంది. తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇలా చేసినందుకు చింతిస్తున్నట్లు అలెగ్జాండర్ చెప్పాడు. కొన్నిసార్లు అనుకోకుండా విక్టోరియాకు కోపం వచ్చేదని అన్నాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రయోగం ఉక్రెయిన్‌, విదేశాలలో ఉండే జంటలు చేయకపోవడం మంచిదని సలహా ఇచ్చారు.

కాగా ఈ జంట తమ చేతి సంకెళ్లను ఆన్‌లైన్ వేలంలో విక్రయించి, ఆ డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ మొత్తం సమాచారాన్ని ఉక్రేనియన్ టెలివిజన్, సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేశారు. ప్రపంచంలో ఏ జంట కూడా ఇలాంటి ఘనత సాధించలేదని ఉక్రేనియన్ రికార్డ్ బుక్‌కు చెందిన ఓ ప్రతినిధి ప్రశంసించారు.

చదవండి: బాబోయ్‌ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు