US President Joe Biden: పుతిన్‌ పరమకసాయి.. NATOని చీల్చాలని ప్రయత్నించాడు, కానీ..: బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు

26 Mar, 2022 20:41 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో భారీ ప్రాణ నష్టం చవిచూస్తూ.. మరో పక్క ప్రపంచాన్ని ఆందోళనలో నెట్టేసిన పుతిన్‌ను పరమ కసాయి వాడిగా అభివర్ణించాడు బైడెన్‌. 

యూరప్‌ దేశాల పర్యటనలో భాగంగా..  అగ్ర రాజ్యం అధ్య‌క్షుడు యుద్ధ క్షేత్ర స‌మీపంగా వెళ్లారు. ర‌ష్యా బాంబుల దాడుల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్‌లో బైడెన్ పర్యటించారు. శ‌నివారం రాజధాని వార్సా నగరానికి వెళ్లిన బైడెన్‌.. అక్కడ పోల్యాండ్ అధ్య‌క్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య సాగుతున్న యుద్ధం, తాజా ప‌రిస్థితులు త‌దిత‌రాల‌పై ఇరు దేశాల నేత‌లు చ‌ర్చించారు.

ఈ వేదికగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బైడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌లు దేశాల కూట‌మిగా ఉన్న నాటోను చీల్చే దిశ‌గా పుతిన్ చాలా య‌త్నాలే చేశార‌ని ఆరోపించిన బైడెన్‌.. అందులో పుతిన్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారని అన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో నాటో కూట‌మి ఉక్రెయిన్‌కు బాస‌ట‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన బైడెన్‌.. ఉక్రెయిన్‌ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు య‌త్నించి బొక్క‌బోర్లా ప‌డ్డార‌ని బైడెన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు పుతిన్‌ను పరమ కసాయిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు ఉక్రెయిన్‌ ఆక్రమణలో.. రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చి ఉంటుందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. ఇక  బైడెన్‌తో చర్చల అనంతరం.. అమెరికా స్పందనపై ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి స్పందించారు.ఈ చర్చల్ని ‘‘ఆశావాదం’’గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉదయం బలగాలతో సరదగా గడిపిన బైడెన్‌.. వాళ్లతో పిజ్జా షేర్‌ చేసుకోవడంతో పాటు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఉక్రెయిన్‌కు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు బైడెన్‌. మరోపక్క రష్యా.. ఉక్రెయిన్‌ మిలిటరీ చర్యలో తొలి దశ మాత్రమే పూర్తైందని ప్రకటించడం విశేషం.

మరిన్ని వార్తలు