అమెరికాను ముంచెత్తిన వరదలు...

30 Sep, 2023 08:45 IST|Sakshi

భారతదేశంలో వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది. అదే సమయంలో అమెరికాలో వర్షాలు, వరదలు ఉగ్ర రూపాన్ని దాలుస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. న్యూయార్క్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నగర ప్రజలు ఇళ్లలోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది.
 

మీడియాకు అందిన వివరాల ప్రకారం న్యూయార్క్‌లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, సబ్‌వేలు జలమయమయ్యాయి. వరదల దృష్ట్యా న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమెరికా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం పలు ప్రాంతాల్లో 6 అంగుళాల మేర వర్షపాతం నమోదయ్యింది. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు