చైనా దూకుడు: ఆంటోని కీలక వ్యాఖ్యలు

25 Nov, 2020 14:08 IST|Sakshi
జో బైడెన్‌- ఆంటోని బ్లింకెన్‌(ఫైల్‌ ఫొటో)

వాషింగ్టన్ ‌: చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామిగా ఉంటుందని ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. ఇండో- సినో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్న డ్రాగన్‌ దేశానికి కళ్లెం వేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌, ఆంటోనీ బ్లింకెన్‌కు యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌(విదేశాంగ మంత్రిగా) అవకాశం ఇవ్వనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. గతంలో బైడెన్‌కు విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్న ఆయన ఆది నుంచి భారత్‌కు మద్దతు పలుకుతూనే ఉన్నారు. (చదవండి: బైడెన్‌ సరికొత్త చరిత్ర.. కానీ ఆనాడు)

ఈ నేపథ్యంలో ఆంటోని బ్లింకెన్‌ ద్వైపాక్షిక బంధం గురించి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రిచర్డ్‌ వర్మ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌తో కలిసి పనిచేస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధాలను పునరుద్ధరిస్తారు. అమెరికాకు భారత్‌తో భాగస్వామ్యం ఎంతో కీలకం. ఒబామా- బైడెన్‌ హయాంలో ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకోవడం సహా కీలక సభ్య దేశంగా ఎదిగేందుకు అన్ని రకాల సాయం అందించాం. ఒకే ఆలోచనా విధానం కలిగిన రెండు దేశాలు కలిసి పనిచేస్తే బంధాలు బలపడతాయి. అలా అయితే చైనా ఆధిపత్య, బెదిరింపు ధోరణిని అడ్డుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. (చదవండి: పట్టు వీడిన ట్రంప్‌)

కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అమెరికా- చైనాల మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం సహా ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ వైఖరిని అగ్రరాజ్యం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి క్వాడ్‌ సమూహాన్ని ఏర్పరిచి చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాలు రచించింది. అయితే జో బైడెన్‌ అధికారంలోకి వస్తే చైనాతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడుతుందనే విశ్లేషణలు వినిపించినప్పటికీ, మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తరహాలోనే ఆంటోని బ్లింకెన్‌ కూడా చైనా కవ్వింపు చర్యల గురించి ప్రస్తావించడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా