టెక్సాస్‌ మ్యూజిక్‌ ఫెస్ట్‌లో తొక్కిసలాట

7 Nov, 2021 04:43 IST|Sakshi

8 మంది మృతి

పలువురికి గాయాలు  

హూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హూస్టన్‌ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. అమెరికన్‌ ర్యాపర్‌ ట్రావిస్‌ స్కాట్‌ చూడడానికి జనం ఎగబడడంతో ఈ ఘోరం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 50 వేల మంది హాజరయ్యారు. వారంతా ఒకే సారి వేదికపైకి దూసుకురావడంతో ఒకరి మీద మరొకరు పడి జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు హూస్టన్‌ చీఫ్‌ శామ్‌ పేన శనివారం మీడియాకు వెల్లడించారు. అమెరికన్లలో మంచి క్రేజ్‌ ఉన్న  ర్యాపర్‌ స్కాట్‌ ఆస్ట్రోవరల్డ్‌ ఫెస్టివల్‌ను గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు.

  శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే టిక్కెట్లు మే నెలలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫెస్టివల్‌చూడడానికి వచ్చిన జనం స్టేజీ వైపుగా వెళ్లడానికి చేసే ప్రయత్నాల్లో తొక్కిసలాట జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. ఆ అభిమానుల్ని కట్టడి చేయడంలో  భద్రతా సిబ్బంది విఫలం కావడంతో ఈ దారుణం జరిగింది. జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టడంతో చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో అప్పటికప్పుడు ఫెస్టివల్‌ని రద్దు చేశారు. ఆ పక్కనే తాత్కాలికంగా ఆస్పత్రి ఏర్పాటు చేసి 300 మందికి పైగా చికిత్స చేసినట్టుగా శామ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు