రికార్డు బద్ధలు!: 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించేందుకు.. ఈయన చేస్తున్న ఖర్చు ఎంతంటే..

26 Jan, 2023 16:21 IST|Sakshi

వయసుపై బడే కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే.. ఈ మార్గాల్లో కాకుండా విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న వాళ్లనూ తరచూ చూస్తున్నాం. రివర్స్‌ ఏజింగ్‌.. అంటే వయసు వెనక్కి తీసుకెళ్లడం. అసలు అది సాధ్యమేనా? అనే విషయం పక్కనపెడితే.. వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయొచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా..  అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన ఓ సాఫ్ట్‌వేర్‌ మిలియనీర్‌ ప్రయత్నం గురించి బ్లూమ్‌బర్గ్‌ కథనం ఆధారంగా.  

బ్రయాన్‌ జాన్సన్‌.. వయసు 45 ఏళ్లు. బయోటెక్‌ మేధావిగా ఈయనకంటూ యూఎస్‌లో ఓ పేరుంది. పైగా సంపాదనతో మిలియనీర్‌గా ఎదిగాడు. అయితే 18 ఏళ్ల టీనేజర్‌గా కనిపించేందుకు ఈయనగారు ఏడాదికి 2 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టేశారు. మన కరెన్సీలో అది 16,29,68,990 రూపాయలు. ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా.. శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని, గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తి ఉండేలా కనిపించేందుకు చికిత్సలు తీసుకుంటున్నాడట. అంతేకాదు.. 

ప్రతీరోజూ 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట. ఈ రివర్స్‌ ఏజింగ్‌ ప్రక్రియ మొత్తం 29 ఏళ్ల ఫిజిషియన్‌ ఒలీవర్‌ జోల్మాన్‌ నేతృత్వంలో జరుగుతోంది. విశేషం ఏంటంటో.. జోల్మాన్‌తో పాటు జాన్సన్‌కు కూడా వృద్ధాప్యం, దీర్ఘాయువు లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువట. అందుకే.. గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను నేరుగా తనపైనే చేయించుకునేందుకు ముందుకు వచ్చాడతను. అందుకోసం కాలిఫోర్నియా వెనిస్‌లోని తన నివాసాన్నే ప్రయోగశాలగా మార్చేశాడతను. అధికారికంగా యాంటీ ఏజింగ్‌ కోసం అతను చేస్తున్న ఖర్చు(వ్యక్తిగతంగా) ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది కూడా.

ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు.. రెగ్యులర్‌గా చేయాల్సిన ఎక్స్‌ర్‌సైజులు, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ షరామాములుగా కాకుండా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా.. 2 మిలియన్‌ డాలర్ల డబ్బు ఖర్చు చేశాడతను. ఈ ఏడాదిలో బ్రెయిన్‌, లంగ్స్‌, లివర్‌, కిడ్నీలు, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటిని 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాడతను. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా పర్వాలేదని, ఒకవేళ ప్రయోగం సక్సెస్‌ అయితే నవయవ్వనంగా కనిపించాలనుకుంటున్న మనిషి కోరిక నెరవేరేందుకు ఒక మార్గం దొరుకుతుందని అంటున్నాడు బ్రయాన్‌ జాన్సన్‌.
 

మరిన్ని వార్తలు