China Corona Updates: ఒకే కోవిడ్‌ కేసు.. లాక్‌డౌన్‌లోకి 3లక్షల మంది.. బయటకు వచ్చారో అంతే..!

12 Jul, 2022 16:36 IST|Sakshi

బీజింగ్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్‌ ప్రభావిత నగరాలపై లాక్‌డౌన్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్‌డౌన్‌ విధించింది జిన్‌పింగ్‌ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. 

హెనాన్‌ ప్రావిన్స్‌లోని వుగాంగ్‌ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది
చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్‌ బ్యాంక్‌ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది.

ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్‌.. వ‍‍్యాక్సిన్‌ తీసుకున్నా సోకుతోంది

మరిన్ని వార్తలు