చైనా దుస్సాహసం జిన్‌పింగ్‌ ఆలోచన

14 Sep, 2020 05:28 IST|Sakshi

అమెరికా పత్రిక న్యూస్‌ వీక్‌ కథనం

వాషింగ్టన్‌: భారత్‌ సరిహద్దుల్లో ఇటీవలి చైనా దుశ్చర్యలకు వ్యూహరచన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌దేనని తాజాగా వెల్లడైంది. తన భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రమాదకర ఎత్తుగడకు జిన్‌పింగ్‌ తెరతీశారని, అయితే, భారత సైనికులు వీరోచితంగా ఎదురు నిలవడంతో ఆ వ్యూహం విఫలమైందని అమెరికాకు చెందిన పత్రిక ‘ద న్యూస్‌వీక్‌’ పేర్కొంది. ఈ వైఫల్యం విపరిణామాలను జిన్‌పింగ్‌ ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది.

అయితే, దీన్ని కారణంగా చూపి సైన్యంలోని  విరోధులకు చెక్‌ పెట్టేందుకు ఆయన ప్రయత్నించవచ్చని వెల్లడించింది. అలాగే, భారత్‌పై సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగవచ్చని పేర్కొంది. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో  జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు కూడా మరణాలు సంభవించినప్పటికీ.. ఆ సంఖ్యను చైనా నేటికీ వెల్లడించలేదు. ఆ ఘర్షణల్లో చైనాకు చెందిన కనీసం 43 మంది సైనికులు చనిపోయి ఉంటారని తాజాగా న్యూస్‌వీక్‌ పేర్కొంది.

ఆ సంఖ్య గరిష్టంగా 60 వరకు ఉండొచ్చని ఫౌండేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ డెమొక్రసీస్‌కు చెందిన క్లియొ పాస్కల్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది.  ఐదు దశాబ్దాల్లో తొలిసారి గత నెలలో చైనా ఆర్మీపై భారత సైనికులు దుందుడుకుగా ముందుకువెళ్లి, కీలక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నారని, ఇది చైనా సైనికులను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆ కథనంలో న్యూస్‌వీక్‌ పేర్కొంది. గతంలో చైనా ఆధీనంలో ఉన్న మూడు కీలక ప్రాంతాలను తాజాగా భారత్‌ కైవసం చేసుకుందని వెల్లడించింది. ముఖాముఖి ఘర్షణల్లో చైనా గ్రౌండ్‌ ఫోర్స్‌కు ఘన చరిత్ర ఏమీ లేదని, వియత్నాంతో యుద్ధంలో ఓటమిని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించింది. భారత సైనికులు కొత్తగా నూతనోత్తేజంతో కనిపిస్తున్నారని, దూకుడుగా ఎదురుదాడికి దిగుతున్నారని ప్రశంసించింది. 

మరిన్ని వార్తలు