సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన

13 Dec, 2022 15:32 IST|Sakshi

బీజింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద భారత్‌, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్‌ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. 

‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్‌ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌. 

తవాంగ్‌ సెక్టార్‌లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: తవాంగ్‌ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్‌ జెట్స్‌ గస్తీ

మరిన్ని వార్తలు