భారత మీడియా కథనాలకు చెక్‌? మరో పదేళ్లపాటు జిన్‌పింగ్‌ అధ్యక్షుడు!

26 Sep, 2022 17:18 IST|Sakshi

సైనిక తిరుగుబాటు.. గృహ నిర్భంధం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ గురించి భారత మీడియాలో జరిగిన ప్రచారాలతో యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉజ్బెకిస్తాన్‌ సమర్‌ఖండ్‌ ఎస్‌సీవో సదస్సుకు హాజరై.. తిరిగి చైనాకు చేరుకున్న జిన్‌పింగ్‌ మీడియా కంట కనబడకపోవడంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు బీజింగ్‌లో మిలిటరీ కదలికలు, భారీగా విమానాలు రద్దు కావడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.  అయితే.. అవి కేవలం పుకార్లుగా తేలుస్తూ.. త్వరలో ఒక బలమైన  ప్రకటనను జింగ్‌పిన్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

మరో దఫా చైనాకు అధ్యక్షుడిగా కొనసాగాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు 20వ చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ) కాంగ్రెస్‌ వేదికగా ఆయన ప్రకటన చేయనున్నట్లు అక్కడి బ్లాగులు కొన్ని కథనాలు ప్రచురిస్తున్నాయి. అక్టోబర్‌ 16వ తేదీ నుంచి వారంపాటు సీపీసీ సమావేశం సాగనుంది. కీలకమైన ఈ సమావేశం నుంచి సీపీసీ బలాన్ని, జిన్‌పింగ్ కీర్తిని ప్రదర్శించడానికి అత్యంత ప్రణాళికాబద్ధమైన వేదికగా ఉపయోగించబోతున్నారు. సుమారుగా రెండు వేలకు పైగా పార్టీ ప్రతినిధుల్ని ఈసారి సీపీసీ వేదికగా నియమించబోతున్నారు. ఇందులో 200 మంది శాశ్వత సభ్యులు, 170 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఉంటారని తెలుస్తోంది.

ఇక ఈ దఫా కూడా సీపీసీలో 69 ఏళ్ల జిన్‌పింగ్‌ ఆధిపత్యమే కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో దఫా అంటే ఐదేళ్లు లేదంటే.. మరో పదేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా సీపీసీలో ఆయన తీర్మానం ప్రకటిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. ఈ గ్యాప్‌లో తన వారసుడిని ఎంచుకునేందుకు తనకు వీలు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం. గతంలో మావో జెడాంగ్‌ కూడా ఇదే తరహాలో వ్యవహరించాడని, ఒకవేళ జిన్‌పింగ్‌ గనుక తన వారసుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఆ వ్యక్తికి రాజకీయ పలుకబడి ఉంటుందనే గ్యారెంటీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కరోనా నుంచి జిన్‌పింగ్‌ పట్ల చైనాలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కఠిన లాక్‌డౌన్ నిబంధనలతో పరోక్షంగా మరణాలకు కారణం అయ్యాడంటూ ఆయనపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు అక్కడి జనాలు. మరోవైపు పాలనాపరంగానూ జిన్‌పింగ్‌ తీరుపట్ల సీపీసీలోనూ అసంతృప్తి నెలకొందనే ప్రచారం వినిపిస్తోంది. అందుకే మిలిటరీ చీఫ్‌ చైనాకు అధ్యక్షుడు కాబోతున్నాడంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు