ఖాతాలో కోట్లు : కంగుతిన్న కస్టమర్

25 Aug, 2020 09:01 IST|Sakshi

అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను వినియోగదారుల ఖాతాల్లోకి తరలించిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరో దిగ్గజ  బ్యాంకులో జరిగిన  ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కస్టమర్ ఖాతాలో ఇంకా పెద్ద నగదు దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు బ్యాంకు ఎంతకీ ఈ విషయాన్ని గమనించక పోవడంతో సదరు కస్టమర్ స్వయంగా బ్యాంకును సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. 

బ్యాంక్ ఆఫ్ అమెరికా  వినియోగదారుడు, సైకియాట్రిస్ట్ బ్లేజ్ అగ్యురేకి ఈ వింత అనుభవం ఎదురైంది. తన ఖాతాలో ఎన్నడూ లేనంతగా 2.45 బిలియన్ డాలర్లు (సుమారు182 కోట్ల రూపాయలు) చూసి ఖంగుతిన్నాడు. మొబైల్, వెబ్ లో పరిశీలించి ఖాతాలో సొమ్మును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుకున్నాడు. బ్యాంకు ఈ విషయాన్ని గుర్తిస్తుందని బ్లేజ్ ఎదురు చూశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్‌ను  సంప్రదించి సమస్యను పరిష్కరించుకునే దాకా అతని కంటి మీద కునుకు పట్టలేదు.   

అయితే జస్ట్ ఇది..డిస్ ప్లే సమస్య తప్ప మరేమీ కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బిల్ హాల్డిన్ తేల్చిపారేశారు. ఈ పొరపాటును సరిదిద్దినట్టు ప్రకటించారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇలాంటి తప్పిదాలు జరగడం ఇదే మొదటిసారికాదు. ఈ నెల ప్రారంభంలో కొంతమంది ఆన్‌లైన్ మొబైల్-బ్యాంకింగ్ ఖాతాదారులు బ్యాలెన్స్‌లు సరిపోలక ఆందోళన చెందారు. దీంతో ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ,  సమగ్రతపై కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కాస్మెటిక్ దిగ్గజం రెవ్లాన్ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఏజెంట్‌గా ఉన్న సిటీ గ్రూపు  రుణదాతలకు పొరపాటున భారీ ఎత్తున చెల్లింపులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు