ఎన్ని సాధించినా అవార్డులు ఎందుకివ్వరు?!

25 Aug, 2020 09:04 IST|Sakshi

రికార్డు సృష్టించినా... స్వర్ణాలు నెగ్గినా

‘ఖేల్‌రత్న’ కాలేకపోయిన నీరజ్‌ చోప్రా

జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికపై మరోసారి విమర్శలు

క్రీడా పురస్కారాల సమయంలో ప్రతీసారి వివాదాలు, విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. ఈసారీ సెలెక్షన్‌ కమిటీ ఏకంగా ఐదుగురు ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’లను, 27 మంది ‘అర్జున’ విజేతల్ని ఎంపిక చేసింది. ఇంత మందిని ఎంపిక చేసినా నిఖార్సయిన అర్హుల్ని మరోసారి అవార్డులకు దూరం చేయడమే తీవ్ర విమర్శలకు దారితీసింది.
    –సాక్షి క్రీడా విభాగం

యేటా జాతీయ క్రీడా అవార్డులంటేనే ఓ ప్రహసనంలా మారింది. దీనికి ఓ కమిటీ... ఓ కొలమానం అంటూ అన్నీ ఉన్నా... మరీ అర్హులు, అంతర్జాతీయ వేదికల్లో విజేతలు భారత క్రీడా పురస్కారాలకు ఎందుకు దూరమవుతున్నారో ఎవరికీ అంతుచిక్కని సమస్యలా మారింది. అందరూ ఆర్జీలు పెట్టుకున్నా... కొందరైతే సులభంగానే అవార్డులు కొట్టేస్తున్నారు. కానీ... ముఖ్యంగా విశేష ప్రతిభ కనబరిచిన వారైతే ఎందుకు ఖేల్‌రత్నాలు, అర్జున అవార్డీలు కాలేకపోతున్నారో? సమధానం లేని ప్రశ్నలా ఎందుకు మిగులుతున్నారో అర్థం కావడం లేదు. ‘జావెలిన్‌ త్రోయర్‌’ నీరజ్‌ చోప్రా కొన్నేళ్లుగా ‘ప్రపంచ పతకాలు’ సాధిస్తున్నాడు. కానీ భారత్‌లో ‘ఖేల్‌రత్న’ం కాలేదు. హాకీ ప్లేయర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌... ‘ట్రిపుల్‌ జంపర్‌’ అర్పిందర్‌ సింగ్‌ అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. అయినా అర్జునకు అనర్హులే! దివ్యాంగ షట్లర్‌ మానసి జోషి కాలు లేకపోయినా కదన కుతూహలంతో రాణిస్తోంది. ఎందుకనో అవార్డుల కమిటీనే మెప్పించలేకపోతోంది. వీళ్ల పతకాలు, ప్రదర్శన తెలిసిన వారెవరైనా సరే... ‘అర్హుల జాబితాలో ఉండాల్సింది వీరే కదా’ అనే అంటారు. కానీ వీళ్లు మాత్రం లేరు. 

(చదవండి: నా కష్టానికి దక్కిన ఫలం)

ముమ్మాటికి చోప్రా ‘రత్న’మే... 
ఈ ఏడాది ఐదుగురు క్రీడాకారులు ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’కు ఎంపికయ్యారు. చరిత్రలో ఐదుమందికి ఒకేసారి ‘ఖేల్‌రత్న’ లభించడం ఇదే మొదటిసారి. అయితే టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ మనిక బత్రా కంటే చాంపియన్‌ అథ్లెట్‌ నీరజ్‌ జోప్రా ఈ పురస్కారానికి ఎన్నో రెట్లు అర్హుడు. ప్రపంచ రికార్డుతో జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (2016)లో స్వర్ణం నెగ్గాడు. అదే ఏడాది దక్షణాసియా క్రీడల్లోనూ చాంపియన్‌. 2017లో ఆసియా చాంపియన్‌షిప్‌ విజేత, ఆ మరుసటి ఏడాది 2018 కామన్వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. వరుసగా మూడేళ్లు అంతర్జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన చోప్రా ఖేల్‌రత్నకు అనర్హుడు ఎలా అవుతాడో కమిటీనే చెప్పాలి. దీనిపై భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య చీఫ్‌ అదిల్‌ సమరివాలా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. మరో అథ్లెట్, ట్రిపుల్‌ జంపర్‌ అర్పిందర్‌ సింగ్‌ 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచాడు. కామన్వెల్త్‌ గేమ్స్, కాంటినెంటల్‌ కప్‌ ఈవెంట్లతో పతకాలు నెగ్గి త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు. కానీ అవార్డుల కమిటీ ముందు డీలా పడిపోయాడు.  
(చదవండి: నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే... )

రూపిందర్‌కూ అన్యాయమే... 
హాకీలో రూపిందర్‌ పాల్‌ సింగ్‌ స్టార్‌ ఆటగాడు. కానీ అవార్డుల విషయంలో ఆ ‘స్టార్‌’ తిరగబడింది. భారత హాకీలోనే అత్యుత్తమ డ్రాగ్‌ ఫ్లికర్లలో రూపిందర్‌ కూడా ఒకడు. మైదానంలో హాకీ స్టిక్‌తో చెమటలు కక్కే ఒంటితో ప్రత్యర్థులతో ముందుండి తలపడే ధీరుడు... అవార్డుల రేసులో మాత్రం వెనుకబడిపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో భారత్‌ కాంస్యం గెలుపొందడంలో అతను కీలకపాత్ర పోషించాడు. కానీ పురస్కారం విషయంలో తిరస్కారానికి గురయ్యాడు.  

మానసి మెరిసినా...
దివ్యాంగ షట్లర్‌ మానసి జోషి కూడా అర్జున కోసం దరఖాస్తు పెట్టుకున్నా... కమిటీ అనుగ్రహానికి దూరమైంది. 31 ఏళ్ల మానసి గత మూడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. 2019లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా అవతరించిన మానసి 2017లో కాంస్యం, 2015లో రజతం గెలిచింది. అంతేకాకుండా 2018 ఆసియా పారా గేమ్స్‌లో కాంస్యం, 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు