అలాగైతేనే వైదొలుగుతా!

28 Nov, 2020 04:45 IST|Sakshi

బైడెన్‌ గెలుపును ఎలక్టోరల్‌ కాలేజీ ధృవీకరించాలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: యూఎస్‌ ఎలక్టోరల్‌ కాలేజీ కనుక జోబైడెన్‌ను విజేతగా ధ్రువీకరిస్తే వైట్‌హౌస్‌ నుంచి వైదొలుగుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. తొలిసారి పదవి నుంచి దిగిపోవడం గురించి ట్రంప్‌ మాట్లాడారు. అయితే, ఎన్నికల ఫలితాలను అంగీకరించనన్నారు. ఒక డెమొక్రాటైన బైడెన్‌ గెలుపును అంగీకరించడం చాలా కష్టమని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి వైదొలగడం గురించి మాట్లాడుతూ ‘‘తప్పక దిగిపోతాను. అది మీకు కూడా తెలుసు. కానీ ఎన్నికల్లో మోసం జరిగిందని  అందరికీ తెలుసు, అందుకే ఓటమిని ఒప్పుకోవడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్స్‌ బైడెన్‌ వైపు మొగ్గు చూపితే దిగిపోతానన్నారు. 

థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మీరంతా ఇది అధ్యక్షుడిగా నా చివరి థ్యాంక్స్‌గివింగ్‌డే అనుకోవచ్చు. కానీ ఎవరికి తెలుసు, ఇది రెండో దఫా అధ్యక్షుడిగా నా తొలి థ్యాంక్స్‌ గివింగ్‌డే కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవలే జీఎస్‌ఏకి అధికార బదిలీ ఏర్పాట్లు చేసేందుకు ట్రంప్‌ అనుమతించారు. 538 మంది సభ్యులుండే ఎలక్టోరల్‌ కాలేజీ డిసెంబర్‌ 14న సమావేశం కానుంది. అందులో కొత్త అమెరికా అధ్యక్షుడిని ప్రకటిస్తారు. యూఎస్‌లో ఓటర్లు నేరుగా అధ్యక్షున్ని ఎన్నుకోరు. బదులుగా వారు ఎలక్టోరల్స్‌ను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాల్సిఉంటుంది.   

మరిన్ని వార్తలు