చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..!

26 Oct, 2022 16:09 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్‌ వార్మింగ్‌) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌’ హెచ్చరించింది.

ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు.  

శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. 

► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్‌ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్‌ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. 

► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. 

► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్‌ 43 బిలియన్‌ డాలర్లు, చైనా 35 బిలియన్‌ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్‌ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: షాకింగ్‌.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ

మరిన్ని వార్తలు