Bird Flu Strain H10N3: మనిషికి బర్డ్​ఫ్లూ​.. ఆందోళన అక్కర్లేదు!

3 Jun, 2021 10:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్​ఫ్లూ వైరస్​ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే  చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్​ ఫ్లూ వైరస్ కారకం​ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. 

న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్​లో బర్డ్​ఫ్లూ వైరస్​ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్​జియాంగ్​కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్​ఫ్లూ వైరస్​లోని హెచ్​​10ఎన్​3 స్ట్రెయిన్​ బారినపడి ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్​ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్​ ఇన్ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్​10ఎన్​3 స్ట్రెయిన్​తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని  సైంటిస్టులు చెబుతున్నారు. 

గతంలో..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్​ఫ్లూ (హెచ్​5ఎన్​8 స్ట్రెయిన్)​ బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్​లో చైనా హువాన్​ ప్రావిన్స్​లో ఓ బర్డ్​ఫ్లూ (హెచ్​5ఎన్​6 స్ట్రెయిన్​)  కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్​ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్​ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్​ ఇన్​ఫ్లూయెంజాలో హెచ్​5ఎన్​1 మాత్రం కొంచెం రిస్క్​ ఉన్న బర్డ్​ఫ్లూ వైరస్. దీని రిస్క్​ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్​7ఎన్​9 స్ట్రెయిన్​ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్​ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్​ఫ్లూ వైరస్​ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఎలా సోకుతుందంటే..
సాధారణంగా బర్డ్​ఫ్లూ వైరస్​ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్​ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్​ తరహాలోనే ఏవియన్​ ఇన్​ఫ్లూయెంజాలు ​(హెచ్​10ఎన్​3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్​లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్​ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్​ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్​ఫెక్షన్​ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్​ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్​ఫ్లూ ఇన్​ఫెక్షన్​లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్​ఫెక్షన్​కి గురైన పక్షుల ద్వారా  ఆ వ్యక్తిని వైరస్​ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్​ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్​ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్​వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా.  చదవండి: బ్లాక్​ఫంగస్​ దానివల్ల రాదు

వేరియెంట్లతో రిస్క్​ ఛాన్స్​!
వైరస్ స్ట్రెయిన్​లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్​ఫ్లూ స్ట్రెయిన్స్​ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్​ఏవో ఎమర్జెన్సీ సెంటర్​ సైంటిస్ట్ ఫిలిప్​ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్​ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్​ఫెక్షన్​ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక  ఫ్లూ వైరస్​లు వేగంగా మ్యుటేంట్​ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్​ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న ​హెచ్​10ఎన్​3 వేరియెంట్​ జెనెటిక్ సీక్వెన్స్​ తెలిస్తేనే తప్ప..  రిస్క్​  తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు.

చదవండి: Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్‌ ఫ్లూ

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు