విషాదం: బ్యూటీ క్వీన్‌, మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ కన్నుమూత

16 Oct, 2023 12:18 IST|Sakshi

Ex-Miss World contestant Sherika de Armas మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్  షెరికా డి అర్మాస్ (26)  కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె (అక్టోబర్ 13న) తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షెరికా అకాల మరణంతో సొంత దేశం ఉరుగ్వేతోపాటు, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు షెరికా. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు  ఈ మహమ్మారితో పోరాడి చివరికి తనువు చాలించారు.  అర్మాస్ మరణంపై స్నేహితులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఒక స్నేహితురాలిగా మీ ఆప్యాయత, మీ ఆనందం ఎప్పటికి  మర్చిపోలేనివంటూ  మిస్ ఉరుగ్వే 2021 లోలా డి లాస్ శాంటోస్  అర్మాస్‌కు నివాళులు అర్పించారు. 

2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ టాప్ 30లో  స్థానం దక్కించుకోలేకపోయినప్పటకి, ఆరుగురు 18 ఏళ్ల పోటీదారుల్లోఒకరిగా నిలిచింది. బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా, క్యాట్‌వాక్ మోడల్ అయినా తాను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అర్మాస్‌  ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు ఫ్యాషన్‌కి సంబంధించిన ప్రతిదీ ఇష్టమనీ, అందాల పోటీలో, మిస్ యూనివర్స్‌లో పాల్గొనడం అమ్మాయిల కల అనీ పేర్కొన్నారు. కానీ అనేక  సవాళ్లతో నిండిన ఈ అనుభవం తనకు దక్కడంపై సంతోషం  వ్యక్తం చేసింది కూడా.

షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్‌, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌కోసం కొంత సమయాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ కేన్సర్ మహిళల్లో నాలుగో  అత్యంత సాధారణ కేన్సర్‌గా మారిపోయింది. 2018నాటికి, ప్రపంచవ్యాప్తంగా 570,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని అంచనా. దాదాపు 311,000 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. అయితే  HPV టీకా, అలాగే ముందస్తు పరీక్షలు, చికిత్స కేన్సర్‌కు నివారణ మార్గాలు అనేది గుర్తించాలి.

మరిన్ని వార్తలు