Henry Kissinger: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత!

1 Dec, 2023 05:14 IST|Sakshi

వందేళ్ల వయసులో తుదిశ్వాస

శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిసింజర్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు వందేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంగో బాధపడుతున్న కిసింజర్‌ కనెక్టికట్‌లో తన నివాసంలో బుధవారం కన్నుమూశారని ఆయన కన్సల్టెంగ్‌ కంపెనీ ‘కిసింజర్‌ అసోసియేట్స్‌’ ప్రకటించింది. అమెరికా విదేశాంగ విధానం గురించి ఎక్కడ చర్చ జరిగినా కిసింజర్‌ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. అంతలా ఆయన తనదైన ముద్ర వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న కిసింజర్‌ 21వ శతాబ్దంలోనూ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేశారు.   

ఏకకాలంలో రెండు కీలక పదవులు  
కిసింజర్‌ 1923 మే 27న జర్మనీలోని బవేరియన్‌ సిటీలో జని్మంచారు. యూదు మతస్తుడైన కిసింజర్‌ 1938లో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో స్థిరపడ్డారు. మాతృభాష జర్మన్‌. ఇంగ్లిష్‌ భాష అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నప్పటికీ చనిపోయేదాకా జర్మన్‌ యాస మాత్రం ఆయనను వదల్లేదు. న్యూయార్క్‌ సిటీలోని జార్జి వాషింగ్టన్‌ హైసూ్కల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత అమెరికా సైన్యంలో చేరారు.

మాతృదేశం జర్మనీలో అమెరికా తరఫున పోరాడారు. నిఘా విభాగంలో పనిచేశారు. జర్మనీలో నాజీలను ఓడించేందుకు తన వంతు సేవలందించారు. ఆయనకు ‘బ్రాంజ్‌ స్టార్‌’ లభించింది. తర్వాత అమెరికాకు తిరిగివచ్చారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పరిజ్ఞానం పెంచుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ నేత, న్యూయార్క్‌ గవర్నర్‌ నెల్సన్‌ రాక్‌ఫెల్లర్‌కు సలహాలు ఇచ్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రైమరీల్లో రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు రిచర్డ్‌ నిక్సన్‌ విజయం సాధించారు. దాంతో కిసింజర్‌.. నిక్సన్‌ వర్గంలో చేరిపోయారు. నిక్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కిసింజర్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు.

1973లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో రెండు కీలక పదవుల్లో కిసింజర్‌ చక్రం తిప్పారు. కిసింజర్‌ తర్వాత అమెరికాలో ఈ రెండు పదవులను ఒకేసారి ఎవరూ నిర్వర్తించలేదు. వాటర్‌గేట్‌ కుంభకోణంలో నిక్సన్‌ రాజీనామా చేయడంతో అధ్యక్షుడైన గెరాల్డ్‌ ఫోర్డ్‌ హయాంలోనూ కిసింజర్‌ అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలందించారు. వియత్నాంలో అమెరికా యుద్ధానికి ముగింపు పలికేలా చొరవ తీసుకున్నందుకు 1973లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఇజ్రాయెల్‌–అరబ్‌ దేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఎలిజబెత్, డేవిడ్‌ జన్మించారు.   

భారత వ్యతిరేక వైఖరి  
విదేశాంగ మంత్రిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. కార్పొరేషన్లకు, రాజకీయనాయకులకు, ప్రపంచ స్థాయి నేతలకు సలహాలు ఇస్తుండేవారు. సభలు, సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రపంచ పరిణామాలపై తనఅభిప్రాయాలు వెల్లడించేవారు. పలు చిన్న, దుర్బల దేశాలపై అమెరికా యుద్ధాలు, దాడుల వెనుక కిసింజర్‌ దుష్ట రాజనీతి ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనను యుద్ధ నేరగాడిగా పలు దేశాలు అభివర్ణించాయి. కిసింజర్‌ రెండు సార్లు చైనాలో పర్యటించారు. సోవియట్‌ రష్యాకు చెక్‌ పెట్టడానికి చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1971లో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. దీని వెనుక కిసింజర్‌ ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో భారత్‌ను కిసింజర్‌ తీవ్రంగా వ్యతిరేకించేవారు. తరచూ విమర్శలు చేస్తుండేవారు. భారత్‌ను తప్పుపట్టినందుకు ఆ తర్వాతి కాలంలో ఆయన తన సన్నిహితుల వద్ద పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..

మరిన్ని వార్తలు