స్కైడైవర్‌ను కాపాడిన అగ్ని చీమలు!

30 Nov, 2023 12:02 IST|Sakshi

స్కైడైవింగ్‌కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్‌ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్‌ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్‌ చేసేటప్పుడు పారాచూట్‌ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్‌ల కోసం తయారైన పారాచూట్‌లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి  జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. 

 అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్‌కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్‌ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. 

అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏ‍ర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. 
ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక..
 

మరిన్ని వార్తలు