Sundar Pichai: జెలస్‌గా ఉంది..అపుడు బాగా ఏడ్చా!

13 Jul, 2021 08:22 IST|Sakshi

అంతరిక్షం నుంచి భూమిని చూడాలంటే చాలా ఇష్టం: గూగుల్‌ సీఈఓ పిచాయ్‌

ఆఖరిసారి అపుడే కన్నీరు పెట్టా : సుందర్‌  పిచాయ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం గ్లోబల్‌ బిలియనీర్ల అంతరిక్ష యానం హవా నడుస్తోంది. ఇప్పటికే బిలియనీర్, వర్జిన్ గెలాక్టిక్  అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోగా మరో బిలియనీర్‌, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్లెందుకు సిద్ధపడుతున్నారు.  తాజాగా టెక్‌ దిగ్గజం,  గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అంతరిక్షం నుంచి భూమిని చూడటం అంటే తనకు కూడా చాలా ఇష్టమని, త్వరలోనే బెజోస్‌ నింగిలోకి వెళ్లడం తనకు కొంచెం జెలస్‌గా ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్బంగా  మనుషులు సృష్టించిన అత్యంత లోతైన సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా చివరి సారిగా ఎపుడు ఉద్వేగానికి లోనయ్యారని అడిగినప్పుడు కోవిడ్‌-19 ఉదృతి సమయంలో ప్రపంచవ్యాప్తంగా  మృత దేహాలతో ఉన్న ట్రక్‌లు  క్యూలో ఉన్న దృశ్యాన్ని,  అలాగే గత నెలలో భారత దేశంలో నెలకొన్న పరిస్థితి చూసి కన్నీళ్లొచ్చాయని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పుట్టి చెన్నైలో పెరిగిన గూగుల్ సీఈఓ తాను అమెరికన్ పౌరుడినే అయినప్పటికీ తనలో భారతమూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయన్నారు. భారతీయత తనలో కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. 

భద్రత కోసం ఒకేసారి 20 ఫోన్‌లు వాడతా
వివిధ ప్రయోజనాల నిమిత​ం ఒకేసారి 20 ఫోన్‌లను ఉపయోగిస్తున్నానని సుందర్‌  పిచాయ్ వెల్లడించారు. కొత్త  టెక్నాలజీను పరీక్షించేందుకు ఫోన్‌ను నిరంతరం మారుస్తూ ఉంటానని చెప్పారు.  పెద్ద టెక్ కంపెనీలను నడిపే సాంకేతిక నిపుణుల వ్యక్తిగత టెక్‌ అలవాట్లను తెలుసుకోవడం చాలా సాయపడుతుంద న్నారు.  దీంతోపాటు తన పిల్లల కోసం కేటాయించే సమయం, స్క్రీన్ సమయం, పాస్‌వర్డ్ మార్పులు సహా తన టెక్ అలవాట్లను పంచుకున్నారు. అలాగే పన్ను వివాదాస్పద అంశంపై స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపు దారులలో తాము ఒకరమనీ, ముఖ్యంగా యూఎస్‌లో ఎక్కువగా చెల్లిస్తున్నామన్నారు. గత దశాబ్దంలో సగటున  20 శాతానికి పైగా పన్నులు చెల్లించామని తెలిపారు.

కాగా నాసా అపోలో మూన్ ల్యాండింగ్ వార్షికోత్సవం సందర్భంగా బ్లూ ఆరిజిన్ అంతరిక్ష విమానం న్యూ షెపర్డ్‌ వ్యోమనౌక బెజోస్ సుమారు 100 కిలోమీటర్లు లేదా 328వేల అడుగులు ఎగురుతుందని భావిస్తున్నారు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్, ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి ప్రవేశించ నున్నారు. నిజానికి రోదసీయాత్ర చేసిన తొలి బిలియనీర్‌గా రికార్డు సృష్టించాలని బెజోస్‌ భావించారు. ఈ వ్యూహాలతో కార్యాచరణలో ఉండగానే అనూహ్యంగా బెజోస్‌ కంటే ముందే రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో  నింగిలోకి వెళ్లి ఆ రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు