ఈ పక్షి ఎంత డేంజరో తెలుసా?.. నిలువెల్లా విషమే..

14 Aug, 2022 12:05 IST|Sakshi

జంతు ప్రపంచంలో విషపూరితమైనవి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు పాములు, తేళ్లే. అలాగే కొన్ని జాతుల కప్పలు, సాలీళ్లు, కీటకాలు, చివరకు కొన్ని రకాల చేపల్లోనూ విషం ఉంటుందని మనకు తెలుసు. కానీ నిలువెల్లా విషం నింపు­కున్న ఓ పక్షిజాతి గురించి ఎప్పుడైనా విన్నారా?! ఆ పక్షి పేరే హుడెడ్‌ పిటోహుయ్‌. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి అట.
చదవండి: జీబ్రాలు నిలబడే  నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా?

హుడెడ్‌ పిటోహుయ్‌ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! ముద్దొస్తున్నాయి కదా అని దాని ఈకలను సరదాగా నోట్లో పెట్టుకుంటే నోరంతా మొద్దుబారిపోతుందట! కొన్ని గంటలపాటు భరించలేనంత నొప్పి వస్తుందట! అది గోళ్లతో రక్కినా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందట. పక్షవాతం కూడా వచ్చే చాన్స్‌ ఉంటుందట. ఇక విషం డోసు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!!

అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! ఎవరైనా తెగించి దాని మాంసాన్ని వండుతుంటే విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు దాని రుచి సైతం అత్యంత చేదుగా ఉంటుందట!! అందుకే స్థానికులు దీన్ని గార్బేజ్‌ బర్డ్‌ (చెత్త పిట్ట)గా పిలుస్తుంటారు. నాడీమండల వ్యవస్థను దెబ్బతీసే బట్రచోటాక్సిన్‌ అనే రసాయనం ఈ పక్షిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

అయితే ఈ విషాన్ని పిటోహుయ్‌ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో దీని ఆహారమైన పురుగుల వల్ల ఈ విష రసాయనం పక్షిలోకి చేరుతోందని చెబుతున్నారు. ఇంకొందరేమో పేలు, ఇతర కీటకాలను దరిచేరనీయకుండా ఉండేందుకే హుడెడ్‌ పిటోహుయ్‌ ఇలా విషాన్ని ఉత్పత్తి చేస్తుందని విశ్లేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు