టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!

23 Oct, 2023 09:07 IST|Sakshi

రోడ్ ట్రిప్‌లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్‌ ట్రిప్‌కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే  కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. 

భర్త పేరు బ్రూనో టామ్‌చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్‌చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్‌కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్‌కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్‌ కోసం దిగవలసి వచ్చింది.  ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్‌కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది.

దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్‌ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు.
ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు

మరిన్ని వార్తలు