భారత్‌కు రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్‌!

20 Nov, 2023 10:22 IST|Sakshi

భారత్‌కు రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్‌

ఎర్ర సముద్రంలో ఓడను స్వాధీనం చేసుకున్న హౌతీ ఉగ్రవాదులు

హౌతీ చెరలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది

షిప్ హైజాక్‌కు బాధ్యత వహిస్తున్నట్లు  హౌతీ ఉగ్రవాదులు స్పష్టం

టెల్ అవీవ్‌: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్‌ ఎర్ర సముద్రంలో హైజాక్‌కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యగా వెల్లడించింది. వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది కూడా ఓడలో ఉన్నారని తెలిపింది. 

 బ్రిటీష్ యాజమాన్యంలో జపాన్ నిర్వహిస్తున్న కార్గో షిప్‌ను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిప్‌లో ఇజ్రాయెల్ పౌరులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఇది ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న నెతన్యాహు.. అంతర్జాతీయ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఇరాన్ చర్యలను ఆయన ఎండగట్టారు. 

షిప్ హైజాక్‌కు బాధ్యత వహిస్తున్నట్లు  హౌతీ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓటను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. షిప్‌ను యెమెన్ పోర్టుకు తీసుకువచ్చినట్లు చెప్పారు.  దీనిని ఇజ్రాయెల్ ఖండించింది. అది తమ ఓడ కాదని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని ఓడగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఓడ జపాన్ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అందులో ఉన్న 25 మంది సిబ్బంది ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోకు చెందినవారని పేర్కొంది.  

ఇజ్రాయెల్‌పై దాడులను ఉదృతం చేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు గతవారం ప్రకటించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఆధారిత ఓడలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జెండాలు కలిగిన షిప్‌లను హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ఓడల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. 

ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు.  

ఇదీ చదవండి: Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్‌ టోపీ

మరిన్ని వార్తలు