India-Greece: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

26 Aug, 2023 04:27 IST|Sakshi
గ్రీస్‌ అధ్యక్షురాలు కటెరినా నుంచి పురస్కారం అందుకుంటున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ, గ్రీసు ప్రధానమంత్రి కిరియాకోస్‌ తీర్మానం

రెండు దేశాల వాణిజ్యం 2030 నాటికి రెండింతలు కావాలని ఆకాంక్ష 

మోదీకి గ్రీసు ప్రతిష్టాత్మక గౌరవం ప్రదానం    

ఏథెన్స్‌: తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, వివిధ కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గ్రీసు ప్ర«దానమంత్రి కిరియాకోస్‌ మిత్సొటాకిస్‌ ఒక అవగాహనకు వచ్చారు. గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో శుక్రవారం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని, రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసుకోవాలని తీర్మానించుకున్నారు.

రాజకీయ, రక్షణ, ఆర్థిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. రక్షణ, షిప్పింగ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సైబర్‌ స్సేస్, విద్య, సాంస్కృతికం, పర్యాటకం, వ్యవసాయం తదితర ముఖ్యమైన రంగాల్లో భారత్‌–గ్రీసు నడుమ మరింత సహకారం అవసరమని మోదీ, కిరియాకోస్‌ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌(ఐఎస్‌ఏ)లోకి గ్రీసుకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ మేరకు భారత్‌–గ్రీసు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

మోదీకి ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌’  
గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌’ ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ఆయనను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌ను గ్రీసు ప్రభుత్వం 1975లో నెలకొలి్పంది. తొమ్మిదేళ్లలో వివిధ దేశాలు  మోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఇందులో గ్రీసు ఆర్డర్‌ ఆఫ్‌ హానర్‌ కూడా చేరింది.   

చంద్రయాన్‌–3.. మానవాళి విజయం  
చంద్రయాన్‌–3 విజయం కేవలం భారత్‌కే పరిమితం కాదని, ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఏథెన్స్‌లో గ్రీసు అధ్యక్షురాలు కాటెరీనా ఎన్‌ సాకెల్లారోపౌలౌతో సమావేశమయ్యారు.  రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. చంద్రయాన్‌–3 మిషన్‌పై అధ్యక్షురాలు కటెరీనా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రతిస్పందిస్తూ.. చంద్రయాన్‌ ఘనత మొత్తం మానవాళికి చెందుతుందని చెప్పారు.

ఏథెన్స్‌లో మోదీకి ఘన స్వాగతం
ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం గ్రీసు రాజధాని ఏథెన్స్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి గ్రీసు విదేశాంగ మంత్రి జార్జి గెరాపెట్రిటైస్‌ ఘనంగా స్వాగతం పలికారు. గ్రీసులో నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మోదీకి సాదర స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రి గ్రీసులో పర్యటించడం గత 40 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు