భారత్‌లోనే ఏకే–47 తయారీ!

4 Sep, 2020 03:21 IST|Sakshi

రష్యాతో కుదిరిన ఒప్పందం

మాస్కో: భారత్‌లో ఏకే– 47 203 రైఫిల్స్‌ ఉత్పత్తికి సంబంధించి ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్‌ కొలిక్కి వచ్చినట్లు     రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేస్తారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, కల్నోషికోవ్‌ కన్సెర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్‌ వెంచర్‌(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ(50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి.

డీల్‌ విశేషాలు...
► ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్‌ ఆధునికమైన వెర్షన్‌.

►ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్‌ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్‌ రైఫిల్‌ స్థానంలో ఈ ఏకే– 47 –203 7.62ణ39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు.

► భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా.  

► లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.  

► ఒక్కోరైఫిల్‌ ఖరీదు దాదాపు 1100 యూఎస్‌ డాలర్లు ఉండవచ్చు.  

► ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్‌ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు.  

► ఇన్సాస్‌ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్‌ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి.  

► అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్‌ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.    
          
రష్యా రక్షణమంత్రితో రాజ్‌నా«థ్‌ చర్చలు

రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్‌ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో చర్చలు జరిపారు.  ఎస్‌400 మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను సకాలంలో భారత్‌కు అందించాలని రాజ్‌నాథ్‌ కోరినట్లు అధికారులు తెలిపారు. 2021 చివరకు ఈ మిసైల్‌ వ్యవస్థ తొలిబ్యాచ్‌ భారత్‌కు చేరవచ్చని అంచనా. శుక్రవారం రాజ్‌నాథ్‌ ఎస్‌సీఓ సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు