మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్‌లో భారత్‌

8 Mar, 2023 15:32 IST|Sakshi

మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్‌ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు  రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు.

అక్టోబర్‌లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్‌ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్‌ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్‌లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి.

సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ‍ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్‌లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్‌ ఒకటి.

2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్‌ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్‌ గట్టిగా విశ్వసిస్తుందని  రుచిరా అన్నారు.
(చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు