‘ప్లీజ్‌.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు

7 Nov, 2023 09:25 IST|Sakshi

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో విచిత్రమైన భయం నెలకొంది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్‌ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. 

చైనాలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుని, రెండింతలు పెరిగింది.

పిల్లల పెంపకానికి అ‍య్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపధ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనున్నది. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా అధికమయ్యింది. మరోవైపు చైనాలో కార్మికుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు!

మరిన్ని వార్తలు