Omicron Variant In India: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..

8 Jan, 2022 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే  ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్‌ రిస్క్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో  ఈ నిబంధన విధించింది.

మార్గదర్శకాలివే..
► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి
► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి
► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో బుక్‌ చేసుకోవచ్చు.
► పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌కుపంపిస్తారు.
► నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్‌ తప్పనిసరి. 8వ రోజు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ని సువిధ వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్‌ వస్తే మరో  వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి.
► ఎట్‌ రిస్క్‌ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా  విమానాశ్రయంలో రాండమ్‌ పరీక్షలు చేయించుకొని నెగెటివ్‌ వచ్చినా హోంక్వారంటైన్‌ ఉండాలి
► అయిదేళ్లలోపు చిన్నారులకు  పరీక్షల నుంచి మినహాయింపు.

పెరిగిన ఎట్‌ రిస్క్‌ దేశాల జాబితా
ఒమిక్రాన్‌ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్‌ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్‌ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, ఘనా, మారిషస్‌ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా.  

మరిన్ని వార్తలు